Telugu Global
Telangana

బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి రోజే.. హైదరాబాద్ నడిబొడ్డున భారీ విగ్రహావిష్కరణ

ట్యాంక్‌బండ్ సమీపంలో 11.5 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ భారీ విగ్రహాన్ని.. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.

బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి రోజే.. హైదరాబాద్ నడిబొడ్డున భారీ విగ్రహావిష్కరణ
X

హైదరాబాద్ నడిబొడ్డున.. సాగర తీరాన, ప్రసాద్ మల్టీప్లెక్స్ సమీపంలో బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 125 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్న ఈ విగ్రహం పనులు దాదాపు తుది దశకు చేరుకున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పులు ఈశ్వర్ తెలియజేశారు. కొత్త సచివాలయానికి కూత వేటు దూరంలో 11.5 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ భారీ విగ్రహాన్ని.. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.

ఆదివారం నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రికి పనుల పురోగతిని అధికారులు తెలిపారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయినట్లు ఆయనకు వివరించారు. విగ్రహం చుట్టూ ఎలివేషన్, స్మృతి వనం, సెంట్రల్ లైబ్రరీ, ఫౌంటైన్ నిర్మాణం పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని.. మార్చి చివరి నాటికి పూర్తవుతాయని మంత్రికి అధికారులు తెలియజేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విగ్రహం అడుగు భాగంలో పార్లమెంట్‌ను పోలిన నిర్మాణాన్ని చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.

అంబేద్కర్ విగ్రహంతో పాటు.. కింది భాగంలో ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామని.. అది ఆయన జీవిత చరిత్ర, గొప్పదనం తెలిపేలా ఉంటుందని అన్నారు. 125 అడుగుల ఎత్తు, 45.5 అడుగుల వెడల్పుతో అంబేద్కర్ విగ్రహం ఉండబోతోందని అన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న ప్రభుత్వం.. బీఆర్ఎస్ ప్రభుత్వమని ఈశ్వర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విగ్రహ పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

First Published:  26 Feb 2023 7:30 PM IST
Next Story