Telugu Global
Telangana

భూగర్భ జలాల కాలుష్యానికి జీహెచ్ఎంసీ చెక్.. నేడు ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభించనున్న కేటీఆర్

లీషెట్ శుద్ధి నిర్వహణ ప్లాంట్ కారణంగా జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ఇక ఎలాంటి నీటి కాలుష్యం ఉండదు.

భూగర్భ జలాల కాలుష్యానికి జీహెచ్ఎంసీ చెక్.. నేడు ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభించనున్న కేటీఆర్
X

హైదరాబాద్ నగరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు అన్నీ జవహర్ నగర్‌లోని డంప్ యార్డుకు జీహెచ్ఎంసీ తరలిస్తుంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ వ్యర్థాలు నిల్వ చేస్తుండటంతో చుట్టుపక్కల నీరు కలుషితం అవుతోంది. ముఖ్యంగా అక్కడి భూగర్భ జలాలు, చెరువులు కలుషితం అవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ వ్యర్థాల నిర్వహణలో ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నది. పొడి చెత్తను రీసైకిల్ చేసేందుకు అంతర్జాతీయ స్థాయి మెషినరీ అందుబాటులో ఉంది. ఇకపై లిక్విడ్ వేస్ట్‌ను కూడా పూర్తిగా శుద్ధి చేయడానికి నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో జీహెచ్ఎంసీ జవహర్‌నగర్‌లో లీషెట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. రూ.251 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ట్రీట్మెంట్ ప్లాంటును మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించనున్నారు.

లీషెట్ శుద్ధి నిర్వహణ ప్లాంట్ కారణంగా జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ఇక ఎలాంటి నీటి కాలుష్యం ఉండబోదు. డంప్ యార్డ్ కారణంగా సమీపంలోని మల్కారం చెరువు పూర్తిగా వ్యర్థ జలాలతో నిండిపోయింది. అంతే కాకుండా భూజగర్భ జలాలు, చుట్టు పక్కల నీటి కుంటలు కూడా కాలుష్యం బారినపడ్డాయి. వర్షాకాలం వస్తే ఈ చెరువులు, కుంటలు ఉప్పొంగి చుట్టు పక్కల కాలనీ వాసులను కూడా ఇబ్బంది పెడుతున్నది. దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యకు చెక్ పెట్టడానికి మున్సిపల్ శాఖ సమగ్రమైన ప్రణాళిక ఆలోచించి.. లీషెట్ ప్లాంట్‌కు రూపకల్పన చేసింది.

2017లో ఈ భారీ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. అప్పుడో మొబైల్ ఆర్వో సిస్టమ్ ద్వారా రోజుకు 2వేల కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన పాక్షిక ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత దీన్ని రోజుకు 4వేల కిలోలీటర్లకు పెంచారు. అయితే వ్యర్థ జలాలతో కూడిన మల్కారం చెరువులో దాదాపు 12 లక్షల కిలో లీటర్ల నీళ్లు ఉన్నాయి. ఇవి వర్షాకాలంలో పొంగి పొర్లితే చుట్టు పక్కల చెరువులు కూడా కలుషితం అయ్యేవి. దీంతో అప్ప‌ట్లో రూ.4.35 కోట్లతో స్ట్రామ్ వాటర్ డైవర్షన్ స్కీమ్ ప్రారంభించారు. అయినప్పటికీ నీటిని పూర్తిగా కాలుష్యం కాకుండా అరికట్టలేకపోయారు.

దీంతో జీహెచ్ఎంసీ రూ.251 కోట్లతో లీషెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టులో ట్రీట్మెంట్ ప్లాంట్ సహా పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటల పునరుద్దరణ కూడా భాగంగా ఉంది. రాంకీ సంస్థ చేపట్టిన ఈ పనులు దాదాపు ఏడాదిగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మల్కారం చెరువు 50 శాతం వరకు శుద్ధి జరిగింది. రాబోయే కాలంలో పూర్తిగా శుద్ధి అవుతుందని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. శనివారం డంపింగ్ యార్డులో నిర్మించిన లీషెట్ ప్లాంట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం జీవో 58 కింద లబ్ధిదారులకు పట్టాల పంపిణీ జరుగుతుంది.

First Published:  15 April 2023 10:31 AM IST
Next Story