Telugu Global
Telangana

రూ.500లకే గ్యాస్.. ఆ నిబంధనతో అక్రమాలకు చెక్

రాయితీ సిలిండర్లు ఏడాదికి ఎన్ని ఇవ్వాలి..? అనే విషయంపై కూడా కసరత్తులు జరుగుతున్నాయి. నెలకు ఒకటి లేదా రెండు నెలలకు ఒకటి అనే ఆప్షన్లు ప్రభుత్వం ముందు ఉన్నాయి.

రూ.500లకే గ్యాస్.. ఆ నిబంధనతో అక్రమాలకు చెక్
X

ఆరు గ్యారెంటీల అమలుకోసం 100 రోజుల డెడ్ లైన్ పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నియమ నిబంధనలు రూపొందించే దిశగా కసరత్తులు చేస్తోంది. గ్యాస్ సిలిండర్ రూ.500లకే అందించే విషయంలో పౌరసరఫరాల శాఖ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది. రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకున్నా.. బయోమెట్రిక్ అనే నిబంధన ఇందులో చేర్చినట్టు సమాచారం. సబ్సిడీ సిలిండర్ సరఫరా చేస్తే కచ్చితంగా ఆ రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు బయోమెట్రిక్ మిషన్ లో వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన అమలులోకి వస్తే అక్రమాలకు చెక్ పడుతుందని అంటున్నారు అధికారులు.

రేషన్ కార్డ్ ప్రామాణికం..

తెలంగాణలో మొత్తం కోటీ 20లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. రేషన్ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య మాత్రం 89.98 లక్షలుగానే ఉంది. ఇప్పుడు సబ్సిడీ కూడా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకే అందే అవకాశముంది. ఉజ్వల కనెక్షన్లు, ‘గివ్‌ ఇట్‌ అప్‌’లో రాయితీ వదులుకున్నవారిని పక్కనపెడితే మిగతా కార్డులకు ఇప్పుడు 500 రూపాయల సిలిండర్ అందించాల్సి ఉంటుంది. ఇందులో రేషన్‌ కార్డు డేటాబేస్‌ తో మ్యాపింగ్‌ అయిన గ్యాస్‌ కనెక్షన్ల సంఖ్య 63.6 లక్షలు మాత్రమే అంటున్నారు. భారం తగ్గించుకోవాలని ప్రభుత్వం అనుకుంటే మరిన్ని నిబంధనలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించివేయొచ్చు. అప్పుడే అసంతృప్తిని మోయడం ఎందుకనుకుంటే మాత్రం అందరికీ రాయితీ ఇచ్చే అవకాశముంది.

ఏడాదికి ఎన్ని సిలిండర్లు..?

రాయితీ సిలిండర్లు ఏడాదికి ఎన్ని ఇవ్వాలి..? అనే విషయంపై కూడా కసరత్తులు జరుగుతున్నాయి. నెలకు ఒకటి లేదా రెండు నెలలకు ఒకటి అనే ఆప్షన్లు ప్రభుత్వం ముందు ఉన్నాయి. ఇక కొత్త కనెక్షన్ల విషయానికొస్తే.. ఇప్పటికిప్పుడు కొత్తగా గ్యాస్ కనెక్షన్లు తీసుకునేవారిని మాత్రం రాయితీ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం కనిపించడంలేదు. అయితే కనెక్షన్ ఉండి, రేషన్ కార్డు కొత్తగా తీసుకుంటే మాత్రం వారిని అర్హులుగా పరిగణించే అవకాశముంది. మరికొన్ని రోజుల్లోనే పక్కాగా నిబంధనలు రూపొందించి గ్యాస్ సిలిండర్ల గ్యారెంటీని అమలులోకి తేవాలని చూస్తోంది ప్రభుత్వం.

First Published:  24 Dec 2023 10:02 AM IST
Next Story