Telugu Global
Telangana

చంద్రబాబుకు గంగవ్వ క్షమాపణ

ఈ వ్యవహారం తాజాగా గంగవ్వ స్పందించారు. ఓ వీడియో ద్వారా చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు. స్క్రిప్ట్ లో భాగంగా అటువంటి వ్యాఖ్యలు చేశానే గానీ సొంతంగా చేసిన వ్యాఖ్యలు కావని వివరణ ఇచ్చారు.

చంద్రబాబుకు గంగవ్వ క్షమాపణ
X

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నటి గంగవ్వ క్షమాపణలు చెప్పారు. కొన్ని నెలల కిందట ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న గంగవ్వ చంద్రబాబు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఆమె చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు. 'మై విలేజ్ షో' అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా గంగవ్వ ప్రజలకు చేరువైంది. తెలంగాణ స్లాంగ్ లో ఆమె చేసే కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యేవాళ్లకు గంగవ్వ సుపరిచితురాలు. ఆ తర్వాత గంగవ్వ హీరో నాగార్జున హోస్ట్ గా స్టార్ మా నిర్వహిస్తున్న బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి టీవీ ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించారు.

బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ ఉన్నది కొంతకాలమే అయినా అందరినీ ఆకట్టుకున్నారు. ఆ షో ముగిసిన తర్వాత ఓ టీవీ ఛానల్ వాళ్ళు గంగవ్వతో ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో భాగంగా పలువురు రాజకీయ నాయకుల ఫొటోలు చూపించి గంగవ్వతో జాతకం చెప్పిస్తారు. ఆ సందర్భంగా గంగవ్వ పలువురు నాయకుల ఫొటోలు చూసి సరదాగా జాతకం చెప్పారు.

ఆ కార్యక్రమంలో చంద్రబాబు, లోకేష్ ఫొటోలను టీవీ ఛానల్ వాళ్ళు చూపగా.. ఆ ఫొటోలకు జాతకం చెప్పను అంటూ గంగవ్వ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఛానల్ ప్రతినిధులు పదే పదే ఆ ఫొటోలు ముందునుంచి జాతకం చెప్పాలని కోరడంతో..'చంద్రబాబుకు గ్రహణం పట్టింది' అని గంగవ్వ చెబుతారు. ఈ కార్యక్రమంలో గంగవ్వ చెప్పిన ఈ కామెంట్ ను సదరు టీవీ ఛానల్ వాళ్ళు కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియో బయటికి వచ్చినప్పటి నుంచి టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు.

కాగా, ఈ వ్యవహారం తాజాగా గంగవ్వ స్పందించారు. ఓ వీడియో ద్వారా చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు. స్క్రిప్ట్ లో భాగంగా అటువంటి వ్యాఖ్యలు చేశానే గానీ సొంతంగా చేసిన వ్యాఖ్యలు కావని, టీవీ వాళ్లు అనమంటేనే అలా అనాల్సి వచ్చిందని ఆమె వివరణ ఇచ్చారు. తనను క్షమించాలని కోరారు.

'అందరికీ నమస్కారం. నాకు వాళ్లు ఏదైనా చెబితేనే అంటాను. నా అంతట నాకు ఏది అనరాదు. నేను పెద్దగా చదువుకోలేదు. ఆ సార్ ను నేను అనను అంటే.. టీవీ ఛానల్ వాళ్లే అనిపించారు. మీరు తప్పుగా అనుకోవద్దు. క్షమించండి. నాకు తెలువది ఎక్కువ. అనమంటేనే అన్నా. నేను మాట జారితే క్షమించండి' అని వీడియోలో గంగవ్వ పేర్కొన్నారు.

First Published:  24 May 2023 9:04 PM IST
Next Story