వినాయక చవితి ఎప్పుడు? 18నా, 19నా..? తేలని సందిగ్ధం
కొన్ని క్యాలెండర్లలో సెప్టెంబర్ 18 అని ఉంటే.. మరికొన్నింటిలో సెప్టెంబర్ 19న వినాయక చవితి అని ఉండటం గణేశ్ భక్తులను గందరగోళానికి దారి తీసింది.
విఘ్నాలు తొలగించాలని విఘ్నేశ్వరుడిని పూజించే వినాయక చవితిది తెలుగువారి పండగల్లో విశిష్ట స్థానం. వ్యక్తిగతంకానే కాక సామూహికంగానే నిర్వహించుకునే ఈ వేడుకకు పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహం చూపిస్తారు. అయితే ఈసారి వినాయక చవితి ఏ తేదీన వచ్చిందన్నది ఇప్పుడు అతి పెద్ద టాపిక్. కొన్ని క్యాలెండర్లలో సెప్టెంబర్ 18 అని ఉంటే.. మరికొన్నింటిలో సెప్టెంబర్ 19న వినాయక చవితి అని ఉండటం గణేశ్ భక్తులను గందరగోళానికి దారి తీసింది.
18నే అంటున్న తెలంగాణ విద్వత్సభ
వినాయక చవితి పండుగను భాద్రపద శుక్ల చతుర్థి అంటే.. సెప్టెంబర్ 18న సోమవారం నిర్వహించుకోవాలని తెలంగాణ విద్వత్సభ సూచించింది. సెప్టెంబర్ 18 నుంచి నవరాత్రులను మొదలుపెట్టాలని విద్వత్సభ అధ్యక్షుడు యామరం చంద్రశేఖర సిద్ధాంతి చెప్పారు.
19నే ప్రారంభం అంటున్న భాగ్యనగర్ ఉత్సవ కమిటీ
ఇక తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గణేష్ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సెప్టెంబర్ 19 నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ చెప్పింది. ప్రభుత్వం చెబుతుంది కదా ఇదే తేదీ ఖరారవుతుందా అంటే మళ్లీ డౌటే. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రముఖమైన ఖైరతాబాద్ గణేషుడికి 18నే చవితి ఉత్సవాలు ప్రారంభిస్తామని నిర్వాహకులు మంత్రి సమక్షంలోనే ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో అసలు చవితి ఎప్పుడు, ప్రభుత్వం సెలవు ఎప్పుడిస్తుంది అన్నది ఇప్పుడు టాపిక్‌గా మారింది.