గేమ్ ఛేంజర్ ఆడియో లీక్.. పోలీసులకు దిల్ రాజు ఫిర్యాదు
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా నుంచి ఆడియో సాంగ్ లీక్ కావడంపై దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాలోని జరగండి.. జరగండి.. అంటూ సాగే ఆడియో సాంగ్ లీకైంది. దీంతో ఈ పాట ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర ఆన్‌లైన్ వేదికల్లో వైరల్‌గా మారింది.
గేమ్ ఛేంజర్ నుంచి సాంగ్ లీక్ అయినట్లు గుర్తించిన చిత్ర బృందం ఆ సాంగ్ సోషల్ మీడియాలో కనిపించకుండా డిలీట్ చేయించే పని చేపట్టింది. అయితే అప్పటికే ఈ సాంగ్ ను వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్ లో షేర్ చేసుకున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా నుంచి ఆడియో సాంగ్ లీక్ కావడంపై దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆడియో సాంగ్ ను లీక్ చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లీకైనా సాంగ్ క్వాలిటీ కూడా బాగుండటంతో ఇది ఇంటి దొంగల పనే అని తెలుస్తోంది.
కాగా, గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి లీకుల బెడద తప్పడం లేదు. ఇదివరకు కర్నూలు, కోస్తా ప్రాంతాల్లో కొన్ని సీన్లను తెరకెక్కించగా.. షూటింగ్ స్పాట్ లోని దృశ్యాలను లీక్ చేశారు. చరణ్ లుక్ కి సంబంధించి క్లోజ్ షాట్స్ కూడా లీక్ అయ్యాయి. దీంతో ఈ సినిమాలో చరణ్ తండ్రీ కొడుకులుగా డ్యుయల్ రోల్ లో నటిస్తున్నట్లు అందరికీ అర్థమైంది. ఇప్పుడు అదే సినిమా నుంచి ఏకంగా ఆడియో సాంగ్ కూడా లీక్ కావడంతో దిల్ రాజు పోలీసులను ఆశ్రయించారు.