గజ్వేల్ లో జోరందుకున్న ఉపసంహరణలు.. రేపే ఆఖరు
ఉపసంహరణలను పరిగణలోకి తీసుకోకపోతే గజ్వేల్ లో కేసీఆర్ కు 113మంది ప్రత్యర్థులు, కామారెడ్డిలో 55మంది పోటీదారులు ఉన్నారు. అంటే కేసీఆర్ కి మొత్తం పోటీదారులు 168మంది.
సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు స్థానాల్లో ఈసారి గజ్వేల్ అత్యథిక నామినేషన్లతో మొదటి స్థానంలో ఉంది. అయితే ఉపసంహరణలు కూడా అదే స్థాయిలో ఉండటం గమనార్హం. గజ్వేల్ లో అత్యథికంగా 114మంది నామినేషన్లకు ఆమోదం లభించింది. అయితే వీరిలో 28మంది ఈపాటికే తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మరికొందరు అభ్యర్థులు కూడా బరిలోనుంచి తప్పుకుంటారని సమాచారం. రేపటితో నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు.
కేసీఆర్ కి పోటీ ఎంతమందంటే..?
సీఎం కేసీఆర్ ఈసార్ గజ్వేల్ తోపాటు, కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారు. ఉపసంహరణలను పరిగణలోకి తీసుకోకపోతే గజ్వేల్ లో ఆయనకు 113మంది ప్రత్యర్థులు, కామారెడ్డిలో 55మంది పోటీదారులు ఉన్నారు. అంటే కేసీఆర్ కి మొత్తం పోటీదారులు 168మంది. వీరిలో ఎవరెవరు పోటీనుంచి తప్పుకుంటారో రేపు సాయంత్రానికి తేలిపోతుంది. గజ్వేల్ లో ఈటల రాజేందర్, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి.. కేసీఆర్ పై పోటీ చేస్తున్నారు.
119 నియోజకవర్గాలకు గాను మొత్తం 4,798 మంది నామినేషన్లు దాఖలు కాగా.. 608 తిరస్కరణకు గురయ్యాయి. తిరస్కరణకు గురైన వారిలో జానారెడ్డి, ఈటల జమున కూడా ఉన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు అధికారికంగా ముగుస్తుంది. ఆ తర్వాత ఎంతమంది ఎన్నికల బరిలో ఉంటారనేది తేలిపోతుంది. గత ఎన్నికల్లో తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు 2,399 నామినేషన్లు దాఖలు కాగా తిరస్కరణలు, ఉపసంహరణలు పోను చివరకు 1,821 మంది ఎన్నికలో బరిలో నిలిచారు. వీరిలో 1,569 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.