గజ్వేల్ ఫలితం ఆలస్యం.. కారణం ఏంటంటే..?
గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం 2,74,654 ఓటర్లకు గాను ఈ ఎన్నికల్లో 2,31,086 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 84.14 గా నమోదైంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రేపు మొదలవుతుంది. ఉదయం 10గంటలకే తొలి ఫలితం విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే సీఎం కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ నియోజకవర్గం ఫలితం మాత్రం బాగా ఆలస్యం అవుతుందని అంటున్నారు అధికారులు. రాత్రి 8గంటల తర్వాతే గజ్వేల్ ఫలితం వెలువడుతుందని చెప్పారు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్. మొత్తం 23 రౌండ్లలో అక్కడ కౌంటింగ్ జరగాల్సి ఉందని, అందుకే గజ్వేల్ ఫలితం ఆలస్యం అవుతుందన్నారు.
ఆలస్యం ఎందుకంటే..?
గజ్వేల్ లో సీఎం కేసీఆర్ సహా మొత్తం 44మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున తూముకుంట నర్సారెడ్డి, బీజేపీ తరపున ఈటల రాజేందర్ పోటీ చేశారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఇక్కడ ఫలితాల కోసం ఎక్కువ రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 23 రౌండ్లలో కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఇప్పటికే మాక్ కౌంటింగ్ పూర్తి చేశారు అధికారులు. కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేశారు. గజ్వేల్ కౌంటింగ్ రేపు రాత్రి 8 గంటల తర్వాత అధికారికంగా విడుదలవుతుంది. అయితే ఈలోపే మెజార్టీలు తెలిసిపోతాయి కాబట్టి.. ఫలితాన్ని అంచనా వేయొచ్చు.
గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం 2,74,654 ఓటర్లకు గాను ఈ ఎన్నికల్లో 2,31,086 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 84.14 గా నమోదైంది. 2018 ఎన్నికల్లో 88.63 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 4.49 శాతం తగ్గింది. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ శాతం తగ్గడంతో ఆ ప్రభావం గజ్వేల్ పై కూడా పడిందని తెలుస్తోంది.
♦