నేనేమీ దిక్కులేక గజ్వేల్‌కి రాలేదు.. కేసీఆర్‌ను ఢీకొట్టేందుకే వచ్చా.. - ఈటల
ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండగా, గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల పోటీ చేస్తున్నారు.
తానేమీ దిక్కు లేక గజ్వేల్‌కు రాలేదని, కేసీఆర్ ను ఢీకొట్టేందుకే వచ్చానని.. అందుకే ఆయనపై పోటీ చేస్తున్నానని బీజేపీ నేత ఈటల రాజేందర్ వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్ లోనూ ఈటల రాజేందర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ పై పోటీ చేయడంపై తాజాగా ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై ఎందుకు పోటీకి దిగాల్సి వచ్చిందో వివరించారు.
తనకు అన్యాయం జరిగిందని, తాను కూడా కేసీఆర్ బాధితుడినేనని ఈటల చెప్పారు. రాష్ట్రానికి పట్టిన పీడ పోవాలనే కేసీఆర్ ను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తానేమిటో తెలంగాణ ప్రజలకు తెలుసని, ఉద్యమంలో తాను పోషించిన పాత్రను ప్రజలు గుర్తించారని ఈటల చెప్పారు. సీఎం కేసీఆర్ ఏ ఎన్నికల్లోనూ ఇంతవరకు ఓడిపోలేదని, తాను కూడా తన రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా ఓడిపోలేదని అన్నారు.
గజ్వేల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గెలుస్తారా..? లేదా తాను గెలుస్తానా..? అన్నది ఇక్కడి ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని తనను ఓడించేందుకే ప్రవేశపెట్టారని, కానీ ఆ పథకాన్ని సరిగా అమలు చేయలేదని ఈటల విమర్శించారు. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండగా, గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల పోటీ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ రెండు నియోజకవర్గాలపైనే పడింది.