Telugu Global
Telangana

గద్వాల్‌ ఎమ్మెల్యేపై అనర్హత వేటు.. డీకే అరుణకు లక్కీ ఛాన్స్‌..!

కృష్ణమోహన్ రెడ్డికి రూ.3 లక్షల జరిమానా సైతం విధించింది. కృష్ణ మోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు డీకే అరుణ.

గద్వాల్‌ ఎమ్మెల్యేపై అనర్హత వేటు.. డీకే అరుణకు లక్కీ ఛాన్స్‌..!
X

గద్వాల్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి షాకిచ్చింది తెలంగాణ హైకోర్టు. తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని నిర్ధారించిన హైకోర్టు.. ఆయనపై అనర్హత వేటు వేసింది. ఆయన ఎన్నిక చెల్లదని, రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆదేశించింది. కృష్ణమోహన్ రెడ్డికి రూ.3 లక్షల జరిమానా సైతం విధించింది. కృష్ణ మోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు డీకే అరుణ.

కొద్ది రోజుల క్రితం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుపైనా హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. అయితే వనమా సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో జలగం ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేకపోయారు. దీంతో కృష్ణమోహన్ రెడ్డి కూడా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. సుప్రీంకోర్టులో స్టే లభిస్తే.. పదవి కాలం ముగిసిపోయే వరకు ఈ కేసు తేలే అవకాశం ఉండదు. మొత్తంగా.. 2018 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రత్యర్థులపై దాఖలు చేసిన పిటిషన్ల విచారణ చివరి దశకు రావడంతో..ఊహించని తీర్పులు వస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన కృష్ణమోహన్‌ రెడ్డి.. 2009లో టీడీపీ తరఫున గద్వాల్‌ నియోజవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి డీకే అరుణ చేతిలో ఓడిపోయారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన కృష్ణమోహన్ రెడ్డి.. 2014లో ఆ పార్టీ తరఫున బరిలో దిగి ఓడిపోయారు. అయితే 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో.. మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణపై దాదాపు 30 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రస్తుతం గద్వాల్‌ జిల్లా బీఆర్ఎస్‌ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. ఇక డీకే అరుణ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

*

First Published:  24 Aug 2023 10:52 AM GMT
Next Story