తెలంగాణలో ఘర్ వాపసీ అనుమానమే
గద్వాల్ ఎమ్మెల్యేని మంత్రి జూపల్లి బుజ్జగించారు. ఆ బుజ్జగింపులు ఫలించాయి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే బండ్ల కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్ నుంచి వెనక్కి వెళ్లే అవకాశం లేదని తేలిపోయింది.
బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రోజుల వ్యవధిలోనే తిరిగి బీఆర్ఎస్ నేతల్ని కలవడం ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయనే కాదు, మరో ఇద్దరు ముగ్గురు కూడా తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తారని, ఘర్ వాపసీ మొదలైందనే ప్రచారం జరిగింది. అక్కడ సీన్ కట్ చేస్తే, గద్వాల్ ఎమ్మెల్యేని మంత్రి జూపల్లి బుజ్జగించారు. ఆ బుజ్జగింపులు ఫలించాయి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే బండ్ల కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్ నుంచి వెనక్కి వెళ్లే అవకాశం లేదని తేలిపోయింది.
బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన 10మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. వారిలో బండ్ల చేజారినట్టే కనిపించినా చివరకు హస్తం గూటికే చేరుకున్నారు. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి కూడా నష్టనివారణ చర్యలు చేపట్టారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో విందు రాజకీయం మొదలు పెట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ ఆయన భరోసా ఇచ్చారు. తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపులు పూర్తిగా రాజకీయ స్వార్థం కూడినవే అనే విషయం తెలిసిందే. పార్టీ మారినా, తిరిగి వెనక్కి వచ్చినా.. ఏదో ఒక లాభాన్ని వారు ఆశిస్తారు. పార్టీ మారినంత మాత్రాన వారి రాజకీయ జీవితం ముగిసిందని, వెనక్కి వచ్చినంత మాత్రాన వారు సచ్ఛీలురు అని అనుకోలేం. ఆ మాటకొస్తే ప్రజలు కూడా ఇలాంటి ఫిరాయింపుల్ని పూర్తిగా లైట్ తీసుకుంటున్నారు. సరిగ్గా ఎన్నికల వేళ ఫిరాయింపుదారులకు చుక్కలు చూపిస్తున్నారు. పార్టీ మారడటమంటే ఒకరకంగా రాబోయే ఎన్నికలకు రిస్క్ చేయడమేనని చెప్పాలి. రిస్క్ చేసినా దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందని అనుకుంటేనే ఎమ్మెల్యేలు గోడ దూకేస్తున్నారు.