కాంగ్రెస్ కి షాకిచ్చిన గద్వాల్ ఎమ్మెల్యే.. తిరిగి బీఆర్ఎస్ గూటికి
ఇటు నుంచి అటు వెళ్లినంత స్పీడ్ గా అటు నుంచి ఇటు వచ్చేశారు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వర్సబెట్టి కాంగ్రెస్ కండువాలు కప్పేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో ఇటీవల గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. అయితే ఆయన అంతలోనే మనసు మార్చుకున్నారు. ఇటు నుంచి అటు వెళ్లినంత స్పీడ్ గా అటు నుంచి ఇటు వచ్చేశారు. ఈరోజు ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలసి తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ కూటమిలో సందడి మొదలైంది.
ఇప్పుడు రాస్కొండి "బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ అబ్బా" అని.
— BRS Party (@BRSparty) July 30, 2024
తిరిగి సొంత గూటికి చేరుకున్న గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసి పార్టీలో కొనసాగుతా అని తెలిపిన ఎమ్మెల్యే pic.twitter.com/zEHtrEaY8V
ఫలించిన కేటీఆర్ మంత్రాంగం..
తమ ఎమ్మెల్యేలను బెదిరించి మరీ కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇటీవల అసెంబ్లీ స్పీకర్ ను కలసి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు కూడా. వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలలో కొందరితో బీఆర్ఎస్ నేతలు టచ్ లోకి వెళ్లారు. వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. కేటీఆర్ మంత్రాంగం ఫలించి ఈరోజు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గ్రూప్ లోకి వచ్చేశారు. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్పారాయన.
కాంగ్రెస్ లో కలవరం..
గతంలో కూడా ఫిరాయింపులు జరిగాయి కానీ, ఇలా రివర్స్ చేరికలు ఎప్పుడూ లేవు. ఒకవేళ ఉన్నా కూడా ఇంత స్పీడ్ గా జరిగే అవకాశం లేదు. ఇక్కడ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.. చాలా తొందరగానే తన మనసు మార్చుకున్నారు. కాంగ్రెస్ లో ఆయన ఇమడలేకపోయారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కూడా సంప్రదింపులు మొదలు కావడంతో ఆయన వెనక్కు వచ్చేశారు.