Telugu Global
Telangana

తెలంగాణ రాజకీయాల్లోకి మరో పార్టీ.. కొత్త పార్టీ పెట్టనున్న గద్దర్?

గద్దర్ తెలంగాణ వేదికగా కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ఖాయంగానే కనిపిస్తున్నది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న గద్దర్.. ఎన్నికల కమిషన్ అధికారులతో భేటీ అయ్యారు.

తెలంగాణ రాజకీయాల్లోకి మరో పార్టీ.. కొత్త పార్టీ పెట్టనున్న గద్దర్?
X

తెలంగాణ రాజకీయాల్లోకి మరో పార్టీ ఎంట్రీ ఇవ్వబోతున్నది. మరో నాలుగైదు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానున్నది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎన్నిక క్షేత్రంలోకి దిగాయి. పార్టీ శ్రేణులను ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇతర పార్టీ నాయకులను చేర్చుకునే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. బీజేపీ ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం అన్వేషణ సాగిస్తోంది. ఈ క్రమంలో ప్రజా యుద్దనౌక గద్దర్ కొత్త పార్టీ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గద్దర్ తెలంగాణ వేదికగా కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ఖాయంగానే కనిపిస్తున్నది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న గద్దర్.. ఎన్నికల కమిషన్ అధికారులతో భేటీ అయ్యారు. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలపై చర్చించారని తెలుస్తున్నది. త్వరలోనే గద్దర్ కొత్త పార్టీ రిజిష్ట్రేషన్ పూర్తి అవుతుందని సమాచారం. విప్లవ, ప్రజా పోరాటాలకు ప్రతీక అయిన గద్దర్.. తెలంగాణలోని పల్లెపల్లెలో పరిచయం ఉన్న వ్యక్తి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయాలకు కొన్నాళ్లు దూరంగా ఉన్నారు.

కాగా, ఓటు బ్యాంకు రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి చూపని గద్దర్.. అకస్మాతుగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కూడా సమావేశం అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభల్లో కూడా పాల్గొన్నారు. కానీ,ఆ తర్వాత కాంగ్రెస్‌కు కూడా దూరమయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా గద్దర్‌ను కేఏ పాల్ ప్రకటించారు. అప్పుడే గద్దర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ ఉపఎన్నికలో గద్దర్ పోటీ చేయలేదు. ఆ తర్వాత కూడా బయట ఎక్కువగా కనపడలేదు.

తాజాగా, గద్దర్ కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. దీనికి 'గద్దర్ ప్రజా పార్టీ' అనే పేరు పెట్టే అవకాశం ఉన్నది. అలాగే మూడు రంగుల్లో జెండాను రూపొందిస్తారని తెలుస్తున్నది. అంబేద్కర్ సిద్దాంతాలను స్పూర్తికి తెచ్చేలా నీలం, విప్లమోధ్యమాలకు ప్రతీకగా ఎరుపు, అలాగే ఆకుపచ్చ రంగులను జెండాలో ఉండేలా చూస్తున్నారు. గద్దర్ ప్రత్యక్షంగా ఎప్పుడూ ఎన్నికల్లో పాల్గొనలేదు. ఈ సారి పెద్దపల్లి నుంచి ఎంపీగా తన సొంత పార్టీ తరపున పోటీ చేస్తారనే చర్చ జరుగుతున్నది.

గతంలో తాను సీఎం కేసీఆర్‌పై గజ్వేల్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో గజ్వేల్ నుంచి ముందుగా బరిలోకి దిగుతారా అనే చర్చ కూడా జరుగుతోంది. సీఎం కేసీఆర్ వంటి బలమైన నాయకుడిని ఎదుర్కొని గెలవడం చాలా కష్టం. కొత్త పార్టీ పెట్టి ఓటమితో ప్రారంభిస్తే బాగుండదని భావిస్తే మాత్రం.. తెలంగాణలో మరో చోట నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉన్నది. కాగా, పార్టీ రిజిష్ట్రేషన్ పూర్తయిన తర్వాత భారీగా చేరికలు ఉంటాయని గద్దర్ సన్నిహితులు చెబుతున్నారు. మరి ఈ కొత్త పార్టీ ప్రభావం తెలంగాణ రాజకీయాలపై ఎంత మేరకు ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.

First Published:  20 Jun 2023 12:59 PM GMT
Next Story