ఇకపై కాలేజీకి వెళ్తేనే పాస్.. ఐఎస్‌బీ కొత్త మార్గదర్శకాలు ఇవే
డిగ్రీ, పీజీ విద్యార్థులు 90 రోజుల కాల వ్యవధి ఉండే సెమిస్టర్‌లో అన్ని క్లాస్‌లకు హాజరైతే 10 మార్కులు ఇస్తారు.
కాలేజీలకు వెళ్లకుండా.. అటెండెన్స్ తక్కువైనా జరిమానా కట్టేసి ఎగ్జామ్స్ రాస్తామంటే ఇకపై కుదరదు. రెగ్యులర్ విద్యార్థులు తప్పకుండా కాలేజీలకు హాజరు కావాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఇంటర్నల్ ఎగ్జామ్స్, సెమిస్టర్ పరీక్షలు, నిరంతర మూల్యంకనం వంటి కొత్త పద్దతులను డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న విద్యామండలి.. ఈ మేరకు రాష్ట్రంలోని సంప్రదాయ యూనివర్సిటీలకు లేఖ రాసింది.
డిగ్రీ, పీజీ విద్యార్థులు 90 రోజుల కాల వ్యవధి ఉండే సెమిస్టర్‌లో అన్ని క్లాస్‌లకు హాజరైతే 10 మార్కులు ఇస్తారు. అంతకంటే తక్కువ రోజులు హాజరైతే తక్కువ మార్కులు పడతాయి. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కాగా, ఉన్నత విద్యామండలి సూచించిన విధానంతో పాటు సొంతగా మరిన్ని సంస్కరణలు అమలు చేసుకునే స్వేచ్ఛను యూనివర్సిటీలకు ఇచ్చింది.
ఐఎస్‌బీ సిఫార్సుల మేరకు ఉన్నత విద్యా మండలి కొన్ని మార్గదర్శకాలు వెలువరించింది. దీని ప్రకారం ఒక సెమిస్టర్‌లో నాలుగు ఇంటర్నల్ పరీక్షలు ఉంటాయి. ఒక్కో ఇంటర్నల్‌కు 10 శాతం వెయిటేజీ ఉంటుంది. సెమిస్టర్ ముగిసిన తర్వాత 10 శాతం వెయిటేజీలో విద్యార్థి సాధించిన మార్కులను విద్యార్థులకు కేటాయిస్తారు.
ఇంటర్నల్స్ అన్నీ పూర్తయ్యాక సెమినార్‌కు 8, అసైన్‌మెంట్లకు 8, ఇంటర్నల్ టెస్ట్‌కు 16 మార్కులు తీసుకొని మొత్తం 40 మార్కులకు విద్యార్థి ఎంత సాధిస్తే అంత వేస్తారు. అంటే ఒక్కో ఇంటర్నల్‌ను 50 మార్కులకు నిర్వహిస్తే.. వెయిటేజీ 10 శాతంగా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే సెమిస్టర్ పరిక్షలను 60 మార్కులకు, ఇంటర్నల్స్‌ను 40 మార్కులకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.