''దేశంలో గోరక్షకులకు మాత్రమే స్వేచ్ఛ ఉంది''
దేశంలో గోరక్షకులకు తప్ప ప్రజలకు స్వేచ్చ లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. హైదరాబాద్ లో జరిగిన ఓ సభలో ఆయన ప్రసంగించారు.
దేశంలో గోసంరక్షకుల స్వేచ్చకు సంకెళ్లు వేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికే ఎక్కువ స్వేచ్ఛ ఉందని, దానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్ టోలీ చౌకీలో జరిగిన సభలో ఆవేశంగా ప్రసంగించిన ఒవైసీ.. ఇండియాలో ముస్లింలకు అవమానం జరుగుతోందని అన్నారు. చరిత్రలో ముస్లిములు చేసిన త్యాగాలు ఇతరులు చేసిన త్యాగాల కన్నా తక్కువ కాదని, వారి సంక్షేమం కోసం కేంద్రం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధాని మోడీ ఈ నెల 15 న ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించేటప్పుడు దీనిపై హామీ ఇవ్వాలని ఆయన కోరారు.
మనకు స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా పేదరికం ఇంకా కొనసాగుతోందని వాపోయారు. రైతుల ఆదాయం కూడా తక్కువేనన్నారు. దేశ సరిహద్దుల్లో 100 చదరపు మీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించినా.. ఎవరూ నోరు మెదపడం లేదని ఒవైసీ కేంద్రంపై ధ్వజమెత్తారు. చైనా ఆక్రమణ గురించి తానిదివరకే అనేకసార్లు ప్రస్తావించినట్టు చెప్పారు. దేశ సమైక్యతకు అంతా కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. దేశంలో ముస్లిముల ప్రయోజనాలకు తమ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు.