ఒకే బైక్ మీద వెళుతూ.. రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థుల దుర్మరణం
బుధవారం వచ్చిన ఇంటర్ ఫలితాల్లో గణేష్ పాసయ్యాడు. ఫ్రెండ్స్‌తో కలిపి విందు చేసుకుని నలుగురూ ఒకటే బండి మీద బయల్దేరారు.
ఏమవుతుందిలే అనే ధీమా, ప్రమాదాలంటే భయం లేకపోవడం నలుగురు ఇంటర్ విద్యార్థుల జీవితాల్ని కాలరాసేశాయి. ద్విచక్రవాహనంపై మూడో వ్యక్తి ఎక్కడమే నిబంధనలకు విరుద్ధమని పోలీసులు మొత్తుకుంటుంటారు. కానీ, ఏకంగా నలుగురు విద్యార్థులు ఒకే బైక్‌మీద వెళ్లి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న దారుణ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట శివారు లోని ఆకేరు వాగు వంతెన వద్ద జరిగింది.
వరంగల్-ఖమ్మం హైవేపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. వీరంతా 17 ఏళ్ల వయసువారే. వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్, ఇల్లంద గ్రామానికి చెందిన మల్లెపాక సిద్ధు, వరుణ్ తేజ, పొన్నాల రనిల్ కుమార్ స్నేహితులు. బుధవారం వచ్చిన ఇంటర్ ఫలితాల్లో గణేష్ పాసయ్యాడు. ఫ్రెండ్స్‌తో కలిపి విందు చేసుకుని నలుగురూ ఒకటే బండి మీద బయల్దేరారు. హనుమకొండ జిల్లాలో ఎన్నికల సభకు వెళ్లివస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వీరి బైక్‌ను ఢీకొట్టింది.
నలుగురూ ఆ ఇంట్లో ఒక్కగానొక్క కొడుకులు
ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. మరొకరు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాద తీవ్రతకు నలుగురు విద్యార్థులు సుమారు 50 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా ఎగిరి పడ్డారు. మలుపు ఉండటం.. రెండు వాహనాలు వేగంగా రావడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. చనిపోయిన పిల్లలంతా వారి తల్లిదండ్రులకు ఒక్కరే కుమారులు కావడంతో ఇల్లంద గ్రామమంతా విషాదం నెలకొంది.