Telugu Global
Telangana

నాలుగు పోరాటాలకు సజీవ సాక్షి నవ తెలంగాణ..

తెలంగాణ చరిత్రలో జరిగిన నాలుగు ఉద్యమాల్లో అసలైనది, ఫలితం సాధించింది కేసీఆర్ పోరాటం మాత్రమే. అందుకే కేసీఆర్ తెలంగాణ జాతిపితగా గుర్తింపు తెచ్చుకున్నారు.

నాలుగు పోరాటాలకు సజీవ సాక్షి నవ తెలంగాణ..
X

తెలంగాణ అంటే పోరాటం, తెలంగాణ అంటే అస్తిత్వ ఆరాటం. ఒకసారి కాదు తెలంగాణ నాలుగుసార్లు పురిటినొప్పులు పడింది. చివరిగా కేసీఆర్ పోరాటంతో శాశ్వత విముక్తి సాధించి, స్వతంత్ర తెలంగాణగా సగర్వంగా తలెత్తుకుంది. తెలంగాణ చరిత్ర చూస్తే నాలుగు ముఖ్య ఘట్టాలు కళ్లముందు కదలుతాయి. నాటి సాయుధ పోరాటం నుంచి నిన్నటి తెలంగాణ ఉద్యమం వరకు ప్రతి సన్నివేశం చరిత్రలో నిలిచిపోతుంది.

సాయుధ పోరాటం..

మొదటిసారిగా సాయుధ పోరాటం ద్వారా తెలంగాణ అస్తిత్వ వాదం వినిపించింది. 1946నుంచి 1951 వరకు సాయుధ పోరాటం సాగింది. నిజాం పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రాన్ని స్వతంత్ర భారతంలో కలిపినా ఇక్కడి ప్రజల జీవనంలో పెద్దగా మార్పులేవీ రాలేదు. పెత్తందార్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం ఊపందుకుంది. భూస్వామ్య వ్యవస్థను రూపుమాపింది. వేలాది గ్రామాలకు సాయుధ పోరాటం స్వాతంత్రాన్ని సాధించి పెట్టింది.

నాన్ ముల్కీ గో బ్యాక్..

స్థానికుల కడుపు కొట్టి స్థానికేతరులకు ఉద్యోగాలివ్వడాన్ని తప్పుబడుతూ నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం 1952లో మొదలైంది. అదే తొలి తెలంగాణ పోరాటంగా భావిస్తారు. నాన్ ముల్కీ గో బ్యాక్ - ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటూ అప్పట్లో అస్తిత్వ వాదం పెల్లుబికింది. ఉద్యోగాల్లో స్థానికేతరులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తగ్గించాలని, స్థానికుల(ముల్కీ)కు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం మొదలైంది. 1952నుంచి 1956వరకు ఈ ఉద్యమం సాగింది. ఎట్టకేలకు ముల్కీ నిబంధనలకు ప్రభుత్వం ఒప్పుకోవడం, ఆ తర్వాత ఉద్యోగాల్లో జోనల్ వ్యవస్థ రావడంతో ఈ ఉద్యమం ముగిసింది.

తొలిదశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం..

1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పెద్ద ఎత్తున మొదలైంది. విద్యార్థులతో మొదలైన ఈ ఉద్యమం, చివరకు రాజకీయ నాయకుల చేతుల్లో చేరి నీరుగారిపోయింది. ప్రత్యేక రాష్ట్రం సాధించకుండానే ఈ ఉద్యమం ఆగిపోయింది. రాజకీయ స్వలాభం కోసం కొంతమంది నేతలు ఉద్యమాన్ని తాకట్టుపెట్టారనే ఆరోపణలున్నాయి. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన పోరాటం ఉద్రిక్తంగా మారడం, ప్రాణనష్టం జరగడం అందరినీ కలచి వేసింది.

మలిదశ విజయం..

తెలంగాణ సాధనలో రెండో పోరాటం కేసీఆర్ తో మొదలైంది. ప్రత్యేక తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా రాజకీయ పోరాటం మొదలు పెట్టారు. ఉద్యోగుల మద్దతుతో ఈ పోరాటం పెద్దదైంది. చివరకు ఆమరణ నిరాహార దీక్షకు దిగి ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడిన కేసీఆర్, తెలంగాణను సాధించారు. ప్రత్యేక తెలంగాణ అసాధ్యం అనుకున్నవారి కళ్లు తెరిపించారు.

తెలంగాణ చరిత్రలో జరిగిన నాలుగు ఉద్యమాల్లో అసలైనది, ఫలితం సాధించింది కేసీఆర్ పోరాటం మాత్రమే. అందుకే కేసీఆర్ తెలంగాణ జాతిపితగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ అస్తిత్వంలో ఎవరి పాత్ర ఎంత అనే లెక్కలు తీస్తే కేసీఆర్ ముందు వరుసలో ఉంటారు. సెప్టెంబర్ 17 విలీనమా, విమోచనమా అని గాభరా పడుతున్నారు నేతలు... ఈ సత్యాన్ని ఎప్పటికి గ్రహిస్తారో.

First Published:  15 Sept 2022 1:34 PM IST
Next Story