ఎన్నికల వేళ కీలక నేతలపై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు
అసెంబ్లీ ఎన్నికల వేళ టీకాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడుతున్నారంటూ కొంతమందిపై సస్పెన్షన్ వేటు వేసింది.
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని గోడ దూకుళ్లు, కప్పదాట్లు జరిగాయో లెక్కే లేదు. ఎన్నికలకు ఆరు రోజుల ముందు కూడా అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహాం కాంగ్రెస్ లో చేరడం విశేషం. టికెట్ల కేటాయింపులో దాదాపుగా అన్ని పార్టీల్లోనూ అలకలు, బుజ్జగింపులు, ఫిరాయింపులు చోటు చేసుకున్నాయి. అసంతృప్తులు టికెట్ కోసం పెద్దగా వేచి చూడలేదు, వెంటనే పార్టీ ఫిరాయించారు. అప్పటికే బీఆర్ఎస్ టికెట్లు కేటాయించిందని, తమకు అవకాశం లేదని తెలిసినా కూడా చాలామంది కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి కేసీఆర్ కి జై కొట్టారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు పంతం పట్టారు. అయితే పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొంత మందిని తాజాగా కాంగ్రెస్ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఎన్నికల వేళ కాంగ్రెస్ నిర్ణయం కలకలం రేపింది.
అసెంబ్లీ ఎన్నికల వేళ టీకాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడుతున్నారంటూ కొంతమందిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆదిలాబాద్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ రెబల్ సంజీవ రెడ్డిపై అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, నాయకులు భార్గవ్ దేశ్ పాండే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాతను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆదిలాబాద్ టికెట్‌ను సంజీవ రెడ్డి ఆశించగా.. కాంగ్రెస్ ఆ సీటును కంది శ్రీనివాస్ రెడ్డికి కేటాయించింది. దీంతో అసంతృప్తికి గురై సంజీవ రెడ్డి ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసి బరిలో నిలిచారు. నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం కోరినా ఆయన వెనకడుగు వేయలేదు. ఆయనకు మద్దతుగా మరికొందరు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతో అధిష్టానం అందరిపై సస్పెన్షన్ వేటు వేసింది.
♦