బీజేపీ ఎంపీలు నలుగురు కలిసి ఒక్క ప్రాజెక్టు తీసుకొని రాలేదు : ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్
నలుగురు ఎంపీలు కలిసి ఒక్క మెడికల్ కాలేజీని తీసుకొని రాలేకపోయారని వినోద్ కుమార్ మండిపడ్డారు.
తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ చేసింది ఏమీ లేదు. రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఎన్నికయ్యారు. కానీ వాళ్లు ఇన్నేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకొని రాలేదు. ఇన్నాళ్లూ నలుగురు ఎంపీలు రాష్ట్రానికి చేసింది శూన్యమే అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా మంకమ్మతోటలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన రాజగోపురాన్ని మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ..
బీజేపీ, ప్రధాని మోడీ హయాంలో దేశవ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు. కానీ అందులో ఒక్కటి కూడా తెలంగాణకు రాలేదు. నలుగురు ఎంపీలు కలిసి ఒక్క మెడికల్ కాలేజీని తీసుకొని రాలేకపోయారని మండిపడ్డారు. ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నలుగురు ఎంపీలు రాబట్టలేకపోయారని దుయ్యబట్టారు.
తెలంగాణ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ నిర్మించాలనే లక్ష్యంతో దూసుకొని పోతోంది. ఇప్పటికే 21 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ చొరవతో ప్రారంభించుకుంటున్నాము. కరీంనగర్ మెడికల్ కాలేజీకి తాజాగా 100 సీట్లు కూడా కేటాయించారు. అయితే జిల్లాకో నవోదయ పాఠశాల ఇస్తామని చెప్పిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం.. తెలంగాణకు ఒక్క పాఠశాల కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. నవోదయ పాఠశాలలు లేకపోవడం వల్ల తెలంగాణలోని గ్రామీణ విద్యార్థులు నష్టపోతున్నారని విచారం వ్యక్తం చేశారు.
ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ కావాలని అప్పటి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరాను. ఆయన కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఎన్నికల అనంతరం బీజేపీ ప్రభుత్వం ఆ విషయాన్నే మరుగున పడేసిందని విమర్శించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నాలుగు మెడికల్ కాలేజీలు వచ్చాయి. అవన్నీ సీఎం కేసీఆర్ ఘనతే అని ప్రశంసించారు.
ఆరోగ్య తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా ఆసుపత్రి తీసుకొని రావడం మూలంగా పేద, సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో ముందు ఉంచడానికి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌ను గెలిపించి.. ఈ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకొని వెళ్లాలని ఆయన కోరారు.