హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ రేపే ప్రారంభం...ఈ రోజు నుండి ఆ రోడ్లు బంద్
రేపటి నుంచి హైదరాబాద్ లో జరగనున్న ఫార్ములా ఈ రేస్ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో మూడు రోజుల పాటు రోడ్లను, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులను మూసి వేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
రేపటి నుంచి ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. రేపు, ఎల్లుండి హుస్సేన్ సాగర్ తీరం ఇండియన్ రేసింగ్ లీగ్ కు వేదిక కానుంది. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం 11 గంటలకు ఆ ప్రాంతాలను పూర్తి గా మూసివేశారు. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఆ ఏరియాల్లోకి ఈ రోజు నుంచి ఆదివారం రాత్రి వరకు ట్రాఫిక్ కు అనుమతిలేదు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ నేపథ్యంలో ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులను ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 21వ తేదీ నుంచి యథావిధిగా పార్కులు తెరుచుకోనున్నాయి. వాహనదారులు ప్రజలు ఈ మూడురోజులు సహకరించాలని పోలీసు అధికారులు కోరారు.
కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన జరుగనున్న ఫార్ము లా–ఈ ఎలక్ట్రిక్ కార్ల పోటీలను దృష్టిలో ఉం చుకొని ట్రయల్ రన్ గా ఇం డియన్ రేసింగ్ లీగ్ నవంబర్ – డిసెంబర్ లలో హైదరాబాద్, చెన్నై వేదికలుగా ఈ పోటీలను నిర్వహిస్తోంది. రేపు, ఎల్లుండి ఇక్కడ పోటీల తర్వాత చెన్నైలో కార్ల రేస్ ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ పోటీలను హైదరాబాద్ లో డిసెం బర్ 10–11 తేదీల్లో నిర్వహిస్తారు.
ఈ పోటీల్లోపాల్గొనేందుకు12 రేసింగ్ కార్లు ఇప్పటికే నగరానికి చేరుకున్నా యి. ఈ పోటీల్లో ఐదు టీంలు పాల్గొనబోతున్నాయి. హైదరాబాద్ బ్లాక్బర్డ్స్ , గోవా ఏసెస్, చెన్నై టర్బో రైడర్స్ , బెంగళూరు స్పీడ్స్టర్స్ , స్పీడ్ డెమాన్స్ ఢిల్లీ పేరుతో ఈ 5 టీమ్ లు పోటీ పడతాయి. హైదరాబాద్ టీమ్ లో, రేసింగ్ లో ఏడేళ్ల అనుభవం ఉన్న అనిందిత్ రెడ్డి ప్రధాన ఆకర్షణ. నీల్ జానీ, ఒలివర్ జేమ్స్ , రౌల్ హైమెన్ వంటి గుర్తింపు ఉన్న రేసర్లతో పాటు మహిళల విభాగం లో ప్రముఖ రేసర్ నికోల్ హవ్దా చెన్నై తరఫున బరిలోకి దిగుతోంది.
ఈ రేస్ కు సంబంధించి నిపుణులతో కలిసి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఏర్పాట్లలో భాగంగా, హుస్సేన్‌సాగర్, నెక్లెస్ రోడ్ చుట్టూ 2.7 కిలోమీటర్ల సర్క్యూట్‌ను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు
ఇదిలా ఉండగా 2023లో ఫార్ములా ఈ రేస్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 12 నగరాల్లో భారత్ నుండి ఉన్నది హైదరాబాద్ మాత్రమే. ఒప్పందం ప్రకారం, హైదరాబాద్ రాబోయే నాలుగు సంవత్సరాల పాటు ఈవెంట్‌ను నిర్వహిస్తుంది.
"రేస్ సర్క్యూట్‌లో ఉన్న లండన్, పారిస్, మొనాకో, బెర్లిన్ తదితర నగరాలతో పాటు హైదరాబాద్‌ను ప్రపంచ నగరంగా గుర్తించడమే కాకుండా, ఈ రేస్‌ల వల్ల ఫార్ములా E రేసులకు మూలస్తంభంగా ఉన్న EV సాంకేతికతలను ప్రోత్సహించే నగరంగా, ఆధునిక ఆలోచనలతో సుస్థిరంగా అభివృద్ది చెందే నగరంగా కూడా గుర్తింపు పొందుతుంది." అని అధికారులు అన్నారు.