Telugu Global
Telangana

రాజీవ్ హంతకుల విడుదలపై వెంకయ్య అభ్యంతరం

కొందరు ఉగ్రవాదాన్ని ఒక పాలసీగా పెట్టుకున్నారని.. వారికి వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదం పట్ల అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలన్నారు.

రాజీవ్ హంతకుల విడుదలపై వెంకయ్య అభ్యంతరం
X

దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని హత్య చేసిన వారిని జైలు నుంచి విడుదల చేయడాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తప్పుపట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక భక్తి కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు.. రాజీవ్ హంతకులను వదిలేశారని పత్రికల్లో చదివి చాలా బాధపడ్డానని.. మనసుకు చాలా బాధ కలిగిందన్నారు. రాజకీయాలు వేరని, అభిప్రాయబేధాలు ఉండవచ్చని.. కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ మన దేశ ప్రధానిని చంపిన హంతకుల పట్ల సానుభూతి చూపాల్సిన అవసరం లేదన్నారు. కొందరు ఉగ్రవాదాన్ని ఒక పాలసీగా పెట్టుకున్నారని.. వారికి వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదం పట్ల అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలన్నారు.

సమాజంలో రానురానూ ఒత్తిడి పెరుగుతోందని.. దాని నివారణకు భక్తిమార్గమే సరైనదన్నారు. భక్తిమార్గంలో వెళ్తే శాంతి వస్తుందని.. అప్పుడు మంచి పనులు చేస్తారన్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పుకాదని.. మాతృభాషను విస్మరించకూడదన్నారు. మాతృభాష కళ్లు లాంటివ‌ని.. ఆంగ్ల భాష కళ్ల జోడు లాంటిదన్నారు. కళ్లు ఉన్నప్పుడు కళ్ల జోడు పనిచేస్తుందన్నారు. గూగుల్ వచ్చినా గురువు ఉండాల్సిందేనన్నారు వెంకయ్యనాయుడు.

First Published:  14 Nov 2022 9:06 AM IST
Next Story