షర్మిలకు అడ్డం తిరిగిన రేణుక.. కారణమిదేనా..?
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభిప్రాయాన్నే పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. అలాంటిది రేణుక అభిప్రాయాన్ని అడుగుతారా..? అభ్యంతరాలను పట్టించుకుంటారా..?
కాంగ్రెస్ పార్టీలో విచిత్రమైన పరిస్థితులు కనబడుతున్నాయి. మొన్నటి వరకు షర్మిల విషయంలో ఏమీ మాట్లాడని ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి.. ఇప్పుడు అడ్డం తిరిగారు. పాలేరు అసెంబ్లీ టికెట్ అడగటానికి షర్మిలకు ఉన్న అర్హతలు ఏమిటని ప్రశ్నించారు. షర్మిల తెలంగాణ కోడలైతే తాను ఖమ్మం ఆడబిడ్డనంటూ ఘాటుగా కామెంట్ చేశారు. టికెట్ ఆశించటంలో తప్పులేదని, కానీ అందుకు కొన్ని అర్హతలు ఉండాలన్నారు. పార్టీకి కొన్ని నిబంధనలు ఉంటాయని షర్మిలకు రేణుక గుర్తుచేశారు.
ఎన్నికలకు ముందు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం అంటూ షర్మిల హడావుడి చేయటంపై మాజీ ఎంపీ రేణుక బాగా అసంతృప్తిగా ఉన్నారు. ఖమ్మం ప్రజలను కన్ఫ్యూజ్ చేయద్దని షర్మిలకు హితవుచెప్పారు. షర్మిల కాంగ్రెస్ లో చేరికపై తన అభిప్రాయం కూడా ఉంటుందన్నారు. రేణుక తాజా మాటలు చూస్తుంటే.. షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే విషయంలో ఆమెను ఎవరు అభిప్రాయం అడిగినట్లు లేదు. అందుకనే షర్మిలపై రేణుక మండిపోతున్నారు. కాంగ్రెస్‌లో షర్మిల పార్టీని విలీనం చేయటంలో రేణుకను ఎందుకు అడగాలో అర్థం కావటంలేదు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభిప్రాయాన్నే పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. అలాంటిది రేణుక అభిప్రాయాన్ని అడుగుతారా..? అభ్యంతరాలను పట్టించుకుంటారా..? బహుశా వచ్చే ఎన్నికల్లో షర్మిల ఖమ్మం ఎంపీగా పోటీచేసే ఆలోచనలో ఉన్నట్లున్నారు. అందుకనే ముందు జాగ్రత్తగా రేణుక గోల మొదలుపెట్టారు. అసలు రేణుకకు ఖమ్మం ఎంపీగా టికెట్ ఇవ్వద్దని చాలామంది నేతలు గోలపెడుతున్నారు.
పాలేరు అసెంబ్లీ టికెట్ ను షర్మిల అడిగితే ఖమ్మం మాజీ ఎంపీకి ఎందుకింత మంటగా ఉంది..? ఎందుకంటే.. రాబోయే ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీచేయాలని షర్మిల అనుకుంటున్నారేమో. షర్మిల డిసైడ్ అయితే రేణుక ఆ సీటును ఖాళీ చేయాల్సుంటుంది. ఆ విషయం తెలియటంతోనే రేణుక బాగా మండిపడుతున్నారు. రేపు షర్మిల ఖమ్మం రాజకీయాల్లోకి ఎలా ప్రవేశిస్తారో.. ఒకప్పుడు రేణుక కూడా అలాగే ఎంటరయ్యారు. హైదరాబాద్ కు చెందిన రేణుకా చౌదరి ఖమ్మం ఆడబిడ్డ ఎలాగయ్యారు..? ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపిస్తేనే కదా అయ్యింది. అలాగే రేపటి ఎన్నికల్లో షర్మిల కూడా ఖమ్మం ఆడబిడ్డే అవుతారేమో అన్న టెన్షన్ రేణుకలో మొదలైనట్లు అనుమానంగా ఉంది.
*