పొంగులేటి వైఎస్సార్టీపీలో చేరటం ఖాయమైందా?
మాజీ ఎంపీ కోసం కాంగ్రెస్, బీజేపీలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. వీళ్ళ ప్రయత్నాలు జరుగుతుండగానే పొంగులేటి స్వయంగా వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు.
ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయం ఏమిటో అర్థంకావటంలేదు. బీఆర్ఎస్‌లో ఉండే అవకాశంలేదని మాత్రం అర్థమైపోతోంది. మరి ఏ పార్టీలోకి వెళతారు అన్నదే తెలియడంలేదు. మాజీ ఎంపీ కోసం కాంగ్రెస్, బీజేపీలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. వీళ్ళ ప్రయత్నాలు జరుగుతుండగానే పొంగులేటి స్వయంగా వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు. అంతకుముందు వైఎస్ షర్మిలతో కూడా భేటీ అయినట్లు ప్రచారం జరిగింది కానీ అది కన్ఫర్మ్ కాలేదు.
పొంగులేటి అసలు విషయం చెప్పకుండానే రాజకీయాన్ని నడిపిస్తున్నారు. పెద్ద కాంట్రాక్టర్ అయిన పొంగులేటికి ఆర్థిక, అంగ బలం పుష్కలంగా ఉంది. అంతేకాకుండా మామూలు జనాల్లో సానుకూలత కూడా ఉంది. ఈ కారణంగానే 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున తాను ఖమ్మం ఎంపీగా గెలవటమే కాకుండా వైరా, పినపాక, అశ్వారావుపేటలో అభ్యర్థులను పెట్టి ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. దాంతో జిల్లాలో పొంగులేటి ఇమేజి బాగా పెరిగిపోయింది.
ఇక ప్రస్తుతానికి వస్తే వచ్చే ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో పోటీ చేయబోయే అభ్యర్థిగా విజయాభాయ్‌ని ప్రకటించారు. అలాగే పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేటలో జాలే ఆదినారాయణ, ఇల్లెందులో కోరం కనకయ్య, మధిరలో కోట రాంబాబు, భద్రాచలంలో తెల్లం వెంకట్రావు, సత్తుపల్లిలో మట్టా దయానంద్‌ను ప్రకటించారు. ఏ పార్టీలో చేరుతారో ప్రకటించకుండానే పొంగులేటి అభ్యర్థులను ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్, బీజేపీల్లో చేరేట్లయితే ఇలా అభ్యర్థులను ప్రకటించే అవకాశం పొంగులేటికి ఉండదు. కాబట్టి పొంగులేటి వైఎస్సార్టీపీలోనే చేరబోతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. షర్మిల పార్టీలో చేరి జిల్లా సారథ్య బాధ్యతలు తీసుకునే అవకాశముందని టాక్ నడుస్తోంది.
పాలేరు నుండి షర్మిల పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఆమె పాలేరులో పోటీ చేస్తే గెలుపు బాధ్యతలు పూర్తిగా పొంగులేటే తీసుకోవాలి. అలాగే జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికతో పాటు గెలుపు బాధ్యతలు కూడా పొంగులేటే తీసుకునే అవకాశముంది. షర్మిల పార్టీలో చేరటం ఓకే అయిపోయింది కాబట్టే పార్టీ పేరు చెప్పకుండా పొంగులేటి అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లున్నారు. కావాలనే ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని ప్రకటించకుండా అందరినీ పొంగులేటి టెన్షన్లో పెట్టేస్తున్నారు.