Telugu Global
Telangana

సీఎం రమేష్ నివాసంలో ఉన్న వ్యక్తి రేవంత్ - పీజేఆర్ కుమారుడు విష్టువర్ధన్ రెడ్డి ఫైర్

కాంగ్రెస్‌ను వీడే ఆలోచన లేదని... కొద్దిగా గౌరవం మాత్రమే ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అలా కాకుండా పొమ్మనలేక పొగపెడితే నష్టం ఎవరిలో ఆలోచించుకోవాలన్నారు.

సీఎం రమేష్ నివాసంలో ఉన్న వ్యక్తి రేవంత్ - పీజేఆర్ కుమారుడు విష్టువర్ధన్ రెడ్డి ఫైర్
X

తెలంగాణ పీసీసీ కూర్పుపై కాంగ్రెస్‌పై విభేదాలు తీవ్రమవుతున్నాయి. పీజేఆర్‌ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక చానల్‌తో మాట్లాడిన ఆయన... జంబో బిర్యానీలా కమిటీ ఉందన్నారు. 59 మందిలో పార్టీకి విధేయులుగా ఉన్నవారు ఎంత మంది అని ప్రశ్నించారు. 59 మందిలో సగం మంది అయినా ఏడాది పాటు పార్టీలో ఉంటారే లేదో అని అనుమానం వ్యక్తం చేశారు.

మల్కాజ్‌గిరి ప్రాంతం కాంగ్రెస్‌కు మంచి పట్టున్న ప్రాంతమని.. అలాంటి చోట తన సీటును కూడా త్యాగం చేసిన సర్వే సత్యనారాయణను గుర్తించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇలా జంబో కమిటీ బదులు విధేయులతో కమిటీ వేసి ఉంటే పార్టీకి మంచి జరిగేదన్నారు. మొన్నటికి మొన్న సైకిల్ పార్టీ నుంచి వచ్చిన వారికి కూడా పదవులు ఇచ్చారన్నారు. గాంధీభవన్‌ మెట్లు ఎక్కని వారికి కూడా అవకాశం ఇచ్చారన్నారు. ఇదే రేవంత్ రెడ్డి తాను అధ్యక్షుడిగానే గాంధీభవన్‌లో అడుగుపెడుతా అప్పటి వరకు పెట్టబోనని అన్నారని... తన దగ్గర రికార్డులు కూడా ఉన్నాయన్నారు. ఎంపీ కాకముందు ఢిల్లీలో సీఎం రమేష్ నివాసంలో రేవంత్ రెడ్డి ఉండేవారని విష్ణువర్దన్ రెడ్డి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఫ్లెక్సీల షాపులో పనిచేసుకుంటూ పైకి వచ్చారని.. ఆయనతో తమకు ఎలాంటి వివాదం లేదన్నారు.

కాంగ్రెస్‌ను వీడే ఆలోచన లేదని... కొద్దిగా గౌరవం మాత్రమే ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అలా కాకుండా పొమ్మనలేక పొగపెడితే నష్టం ఎవరిలో ఆలోచించుకోవాలన్నారు. మర్రి శశిధర్ రెడ్డి కూడా కేవలం పార్టీలో తమకు గౌరవం ఉండాలని మాత్రమే కోరారన్నారు. హైదరాబాద్‌ పరిధిలో ఐదారుగురు మాత్రమే విధేయులు కాంగ్రెస్‌కు మిగిలారని వారిని కూడా దూరం చేసుకుంటే ఎలా అని ప్రశ్నించారు.

పక్కవాడికి మన వాహనాన్ని అప్పగిస్తే బాధ్యత లేకుండా ఇష్టానుసారం నడుపుతారని.. అదే సొంత వారు అయితే చక్కగా నడుపుతారని... కాంగ్రెస్‌ తమ సొంత వాహనం అని.. ఇతరులు వచ్చి దాన్ని పాడు చేయకూడదన్నదే తమ ఉద్దేశమన్నారు.

First Published:  12 Dec 2022 8:55 PM IST
Next Story