Telugu Global
Telangana

రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి

పెద్దమ్మ గుడి విషయంలో భక్తుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడారని, గుడిని అవహేళన చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ ఏసీపీకి దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా విష్ణు ఇచ్చినట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి
X

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో వివాదం రాజుకుంది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై సీనియర్ నాయకులు వరుసగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనతో విభేదించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా పార్టీకే రాజీనామా చేశారు. తాజాగా మరో కాంగ్రెస్ నేత ఏకంగా రేవంత్ రెడ్డిపై పోలీసులకే ఫిర్యాదు చేశారు. దివంగత పీజేఆర్ కుమారుడు, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్ రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు టీపీసీసీ చీఫ్‌పై ఫిర్యాదు చేశారు. పెద్దమ్మ గుడి విషయంలో భక్తుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడారని, గుడిని అవహేళన చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కొన్ని రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్ నుంచి మైనర్ బాలికను కారులో తీసుకెళ్లి కొంత మంది మైనర్లు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ ఘటనను వక్రీకరించి రేప్ ఏకంగా పెద్దమ గుడి ప్రాంగణంలోనే జరిగిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు విష్ణువర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీకి దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా విష్ణు ఇచ్చినట్లు తెలుస్తోంది.

``పెద్దమ్మ గుడికి వచ్చే వేలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా రేవంత్ మాట్లాడటం చాలా బాధాకరం. ఆయన ఆరోపించినట్లు పెద్దమ్మ గుడిలో ఎలాంటి ఘటన జరగలేదు. అవి పూర్తిగా నిరాధారమైన వ్యాఖ్యలు. సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి``అని ఫిర్యాదులో విష్ణు పేర్కొన్నట్లు బంజారాహిల్స్ ఏసీపీ తెలిపారు.

కాగా, జూబ్లీహిల్స్‌లోని పెద్దమ గుడి వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్‌గా విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. రేవంత్ ఇటీవల గుడికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు తెలుసుకుని ఆ వీడియోను పోలీసులకు ఇచ్చారు. తాను కాంగ్రెస్ నేతగా ఈ ఫిర్యాదు ఇవ్వలేదని.. కేవలం పెద్దమ్మ గుడి ధర్మకర్తగా.. భక్తుల తరపున కంప్లైంట్ ఫైల్ చేశానని విష్ణు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఇంకా ఈ విషయంపై స్పందించలేదు. కాంగ్రెస్ నాయకులు కూడా ఈ ఫిర్యాదుపై వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. భక్తులకు చెందిన సున్నితమైన అంశం కావడంతో కాంగ్రెస్ నాయకులు నోరు విప్పడం లేదని తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో అని కొంత మంది ఆరా తీస్తున్నారు.

First Published:  28 Aug 2022 1:59 PM IST
Next Story