రామోజీకి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ బహిరంగ లేఖ
15 సంవత్సరాలుగా బలహీన వర్గాలకు చెందాల్సిన భూములు మీ ఆధీనంలో ఉన్నాయి. నాగనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 189, 203 కింద 14 ఎకరాల 30 గుంటల భూమిని దివంగత సీఎం వైఎస్సార్ బలహీన వర్గాలకు కేటాయించారు.
మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు రామోజీరావుకు బహిరంగ లేఖ రాశారు. రామోజీ ఫిలిం సిటీ కింద ఆక్రమించిన భూముల విషయమై సూటిగా ప్రశ్నించారు. వాటిని తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు గాను డెడ్‌లైన్ కూడా విధించారు. గోనె ప్రకాశ్ రామోజీని ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖలో ముఖ్యాంశాలివీ..
సమాజానికి మార్గదర్శకుడినని మీకు మీరే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దని గోనె ప్రకాశ్‌రావు తన లేఖలో రామోజీనుద్దేశించి పేర్కొన్నారు. మీ నిత్య జీవితంలో విలువలు పాటిస్తున్నారా? ఇతరుల విషయాల్లో మీరు ప్రశ్నించే సూత్రాలు మీ విషయంలో ఎందుకు పాటించరు? ఈ బహిరంగ లేఖ ద్వారా ప్రజల పక్షాన అడిగే ప్రశ్నలకు రామోజీ సమాధానం చెప్పాలి..? అంటూ డిమాండ్ చేశారు.
15 సంవత్సరాలుగా బలహీన వర్గాలకు చెందాల్సిన భూములు మీ ఆధీనంలో ఉన్నాయి. నాగనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 189, 203 కింద 14 ఎకరాల 30 గుంటల భూమిని దివంగత సీఎం వైఎస్సార్ బలహీన వర్గాలకు కేటాయించారు. మీ రాజకీయ పలుకుబడితో 15 ఏళ్లుగా పేదల భూమిని ఆక్రమించారు. ప్రభుత్వ రహదారిని రామోజీ ఫిలిం సిటీ కింద ఆక్రమించారు. అనాజ్ పూర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు 13 కి.మీ ప్రభుత్వ రహదారి ఆక్రమించారు. దాని వల్ల కోహెడ, ఇబ్రహీంపట్నం వెళ్ళటానికి దూరం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు ప్రభుత్వ రహదారిని ఆక్రమించడం వల్ల 16 గ్రామాల్లోని 90 వేల మంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. అంటూ ప్రకాశ్‌రావు తెలిపారు.
ప్రజా రహదారిని కబ్జా చేయటాన్ని మీరెలా సమర్ధించుకుంటారు? ప్రభుత్వ రహదారులు మీ ఎస్టేట్ కాదు.. మీ సామ్రాజ్యాన్ని సామాన్యులు చూడకూడదనుకుంటే భారీ ప్రహారీలు నిర్మించుకోండి.. అంతే కానీ అటువైపు ప్రజలు రాకూడదని ప్రభుత్వ రహదారులు ఆక్రమించటం ఏమిటి?.. అంటూ తన లేఖలో ప్రశ్నించారు. అంతేకాదు రామోజీ ఆక్రమించిన ప్రభుత్వ భూములను తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశారు. అందుకు గాను డెడ్‌లైన్ కూడా విధించారు. 2024 మార్చి 31 అందుకు డెడ్‌లైన్‌గా పేర్కొన్నారు. డెడ్ లైన్ లోపు ప్రభుత్వ భూములను అప్పగించకపోతే బుల్డోజర్లు పెట్టి మీ గోడలు కూలుస్తా.. అంటూ గోనె ప్రకాశ్‌రావు హెచ్చరించారు.