రామోజీ ఫిల్మ్ సిటీలో 1700 ఎకరాలు రాజవంశానివే.. ఇవిగో ఆధారాలు
తెలంగాణలో ఆ రాజవంశీయుల భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లాయని.. ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో టాప్ బిల్డర్‌గా ఉన్న రామేశ్వర రావు ఆధీనంలో ఆ భూములు ఉన్నాయన్నారు గోనె.
రామోజీ ఫిల్మ్ సిటీ భూముల విషయంలో సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు. రామోజీ ఫిల్మ్ సిటీలో రాజవంశీకులకు చెందిన భూములతో పాటు అసైన్డ్, రహదారి భూములున్నాయని ఆరోపించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన గోనె.. రామోజీ ఫిల్మ్ సిటీలోని 3 వేల ఎకరాల భూముల్లో 1700 ఎకరాలు గాలిబ్ జంగ్‌కు చెందిన భూములున్నాయని.. ప్రజా రహదారులు, ఎస్సీ ల్యాండ్స్, భూదాన్ భూములను సైతం కబ్జా చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
అనాజ్‌పూర్ - ఇబ్రహీంపట్నం రహదారిని మూసేసి, కబ్జా చేశారని.. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు గోనె. వైఎస్సార్ టైమ్‌లో 682 మందికి 200 గజాల చొప్పున పట్టాలు ఇవ్వగా.. లబ్ధిదారులను వారి స్థలాల్లోకి రానివ్వట్లేదన్నారు. ఈ ఆస్తులను వెంటనే ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని.. రామోజీకి నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కోర్ట్ ఆఫ్ వార్డ్స్ చట్టం ప్రకారం నోటీసులపై రామోజీరావు కోర్టుకు వెళ్లడానికి వీల్లేదని.. ఇది చాలా పటిష్టమైన చట్టమన్నారు.
బ్రిటిషర్లు కోర్ట్ ఆఫ్ వార్డ్స్ చట్టం తీసుకువచ్చారని.. అందులో దేశవ్యాప్తంగా వివిధ రాజవంశాలకు చెందిన 560 మందిని చేర్చారన్నారు గోనె ప్రకాశ్ రావు. నిజాం స్టేట్‌లోనూ ఇలాంటి మార్వాడీ, ముస్లిం కుటుంబాలు 8 ఉన్నాయన్నారు. అయితే ఈ రాజవంశీయులకు చెందిన లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని.. ఈ విషయంలో తాను చేస్తున్న పోరాటం తుది దశకు చేరుకుందన్నారు.
తెలంగాణలో ఆ రాజవంశీయుల భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లాయని.. ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో టాప్ బిల్డర్‌గా ఉన్న రామేశ్వర రావు ఆధీనంలో ఆ భూములు ఉన్నాయన్నారు గోనె. ఆ భూముల్లో ఇప్పటికే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేశారన్నారు. రాష్ట్రంతో పాటు అమెరికాలో బడా పారిశ్రామికవేత్త, ఎయిర్‌పోర్టులు నిర్మించిన వ్యక్తికి స్టార్ హోటళ్లు ఉన్నాయని.. వాటిని తాజ్ గ్రూప్‌కు ఇచ్చారన్నారు. ఆ భూములు కూడా కోర్ట్ ఆఫ్ వార్డ్స్ పరిధిలోనివేనన్నారు.
రాజవంశీయులకి చెందిన వారితో కలిసి న్యాయం కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్‌గాంధీలను కలిసి ఆధారాలు అందిస్తానన్నారు. ఈ తరహా వ్యవహారం కర్ణాటకలోనూ ఉందన్నారు. సీఎంలు రేవంత్, సిద్ధరామయ్య ప్రత్యేక కమిటీ వేసి ఈ భూముల వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు.