Telugu Global
Telangana

కాంగ్రెస్‌లోకి ప్రవీణ్‌రెడ్డి ! ఇక హుస్నాబాద్‌లో టైట్‌ ఫైట్‌ !

టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత ప్రవీణ్‌ రెడ్డి ఎన్నికల టైమ్‌లో ఒకటి రెండు సభల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పూర్తిగా సైలెంట్‌ అయ్యారు. గులాబీ పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేదు.

కాంగ్రెస్‌లోకి ప్రవీణ్‌రెడ్డి ! ఇక హుస్నాబాద్‌లో టైట్‌ ఫైట్‌ !
X

కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగుతోంది. పార్టీ వీడిన మాజీ ఎమ్మెల్యేలకు తిరిగి కాంగ్రెస్‌ కండువా కప్పుతున్నారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో ఆయనకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్ ఖ‌ర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో పాటు మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ సమక్షంలో ఈ చేరిక జరిగింది.

అల్గిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డి హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పట్లో ఈయన చేరిక సంచలనంగా మారింది. ఈయన ఆధ్వర్యంలోనే ఆసియాలోనే ప్రసిద్ది చెందిన ములకనూరు కో ఆపరేటివ్‌ సొసైటీ నడుస్తోంది. పాల వ్యాపారం కూడా సొసైటీ నిర్వహిస్తోంది. ఈయన్ని బెదిరించి ఎన్నికల ముందు గులాబీ కండువా కప్పారని ప్రచారం జరిగింది.

టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత ప్రవీణ్‌ రెడ్డి ఎన్నికల టైమ్‌లో ఒకటి రెండు సభల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పూర్తిగా సైలెంట్‌ అయ్యారు. గులాబీ పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేదు. ఈయనకు ఎమ్మెల్సీ లేదా ఇతర పదవి ఇస్తారని ఆయన అనుచరులు అనుకున్నారు. టీఆర్‌ఎస్‌లో ఏ పదవి లేకపోవడంతో అల్గిరెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరారని తెలుస్తోంది.

అల్గిరెడ్డి చేరికతో హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌కు జోష్‌ రావడం ఖాయం. నియోజకవర్గంలో ప్రధాన మండలాలైన భీమదేవరపల్లి, ములకనూరుతో పాటు హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌కు గట్టి కేడర్‌ ఉంది. ఇక్కడి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సతీష్‌... కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు కుమారుడు. దీంతో అతని కోసం అప్పట్లో ప్రవీణ్‌ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి సతీష్‌ను ఓడించడమే టార్గెట్‌గా అల్గిరెడ్డి పావులు కదపడం ఖాయంగా తెలుస్తోంది.

ఇదే నియోజకవర్గంలో బొమ్మ వెంకటేశ్వర్లు కుమారుడు శ్రీరాం కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించారు. కానీ ఆయనకు నియోజకవర్గంపై పట్టులేకపోవడం లోపమైంది. కాంగ్రెస్‌ వ్యూహాకర్త సునీల్‌ రిపోర్టు ప్రకారమే ప్రవీణ్‌ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చారని తెలుస్తోంది.

ఇటు హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి సీపీఐ తరపున చాడ వెంకటరెడ్డి పోటీ చేసేవారు. కానీ ఆయన ఈ మధ్య అనారోగ్యానికి గురయ్యారు. బైపాస్‌ సర్జరీ చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసేది అనుమానమే. ఇదే సీటు నుంచి బీజేపీ తరపున ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

First Published:  19 July 2022 6:34 PM IST
Next Story