కారు దిగనున్న మాజీ ఎమ్మెల్యే.. బీజేపీలో చేరికకు ప్లాన్..!
ఉద్యమ సమయం నుంచి పార్టీలో కొనసాగుతూ వచ్చిన నరేందర్.. వరంగల్ మేయర్‌గా, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పని చేశారు.
వరంగల్ జిల్లాలో మరో నేత కారు దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గులాబీ పార్టీని వీడుతారని సమాచారం. ఈ నెల 16న ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
ఉద్యమ సమయం నుంచి పార్టీలో కొనసాగుతూ వచ్చిన నరేందర్.. వరంగల్ మేయర్‌గా, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పని చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించిన నన్నపునేని.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమయ్యారు. కొండా సురేఖ ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించగా.. బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు రెండో స్థానంలో నిలిచారు.
అసెంబ్లీ ఎన్నికల టైంలోనే బీజేపీ అభ్యర్థికి నన్నపునేని నరేందర్ మద్దతు పలికారన్న ఆరోపణలు వచ్చాయి. ఓటమి తర్వాత సైలెంట్‌గా ఉన్న నరేందర్.. ఇటీవల వరంగల్ బీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నన్నపునేనితో పాటు పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం బీజేపీలో చేరతారని తెలుస్తోంది.
వరంగల్ జిల్లాలో ఇప్పటికే మాజీ మంత్రి కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య, గుండు సుధారాణి, ఆరూరి రమేష్ లాంటి నేతలు కారు దిగారు. ఆరూరి బీజేపీలో చేరగా.. కడియం, గుండు సుధారాణి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాటికొండ రాజయ్య ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరలేదు.