ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టినోడివి.. రేవంత్‌పై హరీష్ ఫైర్
స్వతంత్ర పోరాటాన్ని చూడని నవతరం.. తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని చూసిందన్నారు. ప్రత్యక్షంగా పాల్గొందన్నారు హరీష్ రావు. ఆ ఆర్తి ఉంది కాబట్టే..2023లో బీఆర్ఎస్ నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు విజయవంతమయ్యాయన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను బీఆర్ఎస్ ఒక రోజు ముందు ప్రారంభించడంపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ వేడుకలను రేవంత్ రెడ్డి పాకిస్థాన్ అవతరణ వేడుకలతో పోల్చడంపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ కామెంట్స్ ఆయన కుసంస్కారానికి, అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వారికి, తెలంగాణ గడ్డ మీద ప్రేమ ఉన్నవారికి రాష్ట్ర అవతరణ ప్రాముఖ్యత అర్థమవుతుందన్నారు.
ఉద్యమంలో ఏనాడు పాల్గొనని వారికి, నోటి నుంచి ఒక్కసారి కూడా జై తెలంగాణ అని నినదించని వారికి.. అమరులకు ఏనాడూ నివాళులర్పించని వారికి ఆ ఆర్తి, ఆ భావోద్వేగం ఎలా అర్ధమవుతుందన్నారు హరీష్ రావు. ఒక్క రోజు ముందుగా జరపడం కాదు.. ఏడాది పొడవునా.. పండుగగా దశాబ్ధి ఉత్సవాలను నిర్వహించే ప్రణాళికను చేశామన్నారు. 2023 జూన్ 2వ తేదీ నుండి 21 రోజులపాటు జరిపిన ఉత్సవాలలో ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంగీత విభావరి, సినిమా, జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీత, నృత్యం, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జూన్ 2న జెండా ఆవిష్కరణతో దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమై, జూన్ 22న అమరుల సంస్మరణతో ముగించామన్నారు.
స్వతంత్ర పోరాటాన్ని చూడని నవతరం.. తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని చూసిందన్నారు. ప్రత్యక్షంగా పాల్గొందన్నారు హరీష్ రావు. ఆ ఆర్తి ఉంది కాబట్టే..2023లో బీఆర్ఎస్ నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు విజయవంతమయ్యాయన్నారు. ఇవన్నీ ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన వారికి ఎలా అర్థమవుతాయన్నారు. అందుకే వారికి కేసీఆర్ శనివారం జరిపిన క్యాండిల్ ర్యాలీ, సంబరాలు పాకిస్థాన్ అవతరణలా అనిపించాయని ఎద్దేవా చేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్ర సీఎంగా భూపేష్ బగేల్ ఉన్నప్పుడు 3 రోజుల పాటు రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిపాడన్న హరీష్ రావు.. భూపేష్ జరిపిన ఉత్సవాలు కూడా పాకిస్థాన్ అవతరణ ఉత్సవాలేనా అని రేవంత్‌ను ప్రశ్నించారు హరీష్ రావు.