Telugu Global
Telangana

ఇది మొండి చేయి బడ్జెట్‌ - హరీష్‌ రావు

రైతుల విషయంలో కాంగ్రెస్‌ మొండి చేయి చూపిందన్నారు. ఎన్నికల ప్రచారంలో రైతులకు చాంతాడంత చెప్పి కేటాయింపులు మాత్రం చెంచాడంతా చేశారన్నారు హరీష్ రావు.

ఇది మొండి చేయి బడ్జెట్‌ - హరీష్‌ రావు
X

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్‌ రావు. బడ్జెట్‌లో అసలు వంద రోజుల ప్రస్తావన లేదన్నారు. దీన్ని బట్టి చూస్తే గ్యారంటీల అమలుపై కాంగ్రెస్‌ చేతులెత్తేసినట్లేనని పరోక్షంగా చెప్పినట్లుందన్నారు. ఆరు గ్యారంటీల్లో 13 అంశాలున్నాయన్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా కాంగ్రెస్ తీరు ఉందన్నారు హరీష్ రావు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దాదాపు రూ.23 వేల కోట్లు అవసరమవుతాయన్న హరీష్‌.. బడ్జెట్‌లో 7 వేల కోట్లు మాత్రమే పెట్టారన్నారు. ఇక కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిరుద్యోగ భృతి ఊసే ఎత్తలేదన్నారు.


రైతుల విషయంలో కాంగ్రెస్‌ మొండి చేయి చూపిందన్నారు. ఎన్నికల ప్రచారంలో రైతులకు చాంతాడంత చెప్పి కేటాయింపులు మాత్రం చెంచాడంతా చేశారన్నారు హరీష్ రావు. డిసెంబర్‌ 9న చేస్తామన్న రుణమాఫీ ప్రస్తావనే లేదన్నారు. ఇక వరికి రూ.500 బోనస్‌ ఇస్తామన్న హామీ బోగస్‌గా మార్చారని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి రూ. 19,746 కోట్లు కేటాయించారని.. ఇందులో 3 వేల కోట్లు జీతాలకే పోతాయన్నారు హరీష్ రావు. ఇక రైతు భరోసా, బోనస్‌, రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించారు.


ఇక రేవంత్ సర్కార్‌ దాదాపు 60 వేల కోట్లు అప్పుగా తీసుకురానుందన్నారు హరీష్ రావు. గత ఆర్థిక సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు కంటే 20 వేల కోట్లు ఎక్కువ అన్నారు. ఆనాడు అప్పులు తెస్తున్నారని గోబెల్స్ ప్రచారం చేసిన కాంగ్రెస్‌ నేతలు మరిప్పుడు అప్పులు ఎందుకు తేస్తున్నారని ప్రశ్నించారు. నేతి బీరకాయలో నెయ్యి తీరుగానే కాంగ్రెస్‌ మాటల్లో నిజాలు అంతేనన్నారు హరీష్ రావు.

First Published:  10 Feb 2024 5:04 PM IST
Next Story