Telugu Global
Telangana

కాంగ్రెస్‌, బీజేపీ దోస్తీ.. ఇదిగో సాక్ష్యం - హరీష్‌ రావు

రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి గవర్నర్ నిరాకరించారని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిని సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారన్నారు హరీష్‌ రావు.

కాంగ్రెస్‌, బీజేపీ దోస్తీ.. ఇదిగో సాక్ష్యం - హరీష్‌ రావు
X

కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటే. బీఆర్ఎస్ నేతలు ఇటీవల తరచూ చేస్తున్న ఆరోపణ ఇది. బీజేపీ నేతల వైఖరి కూడా ఇందుకు బలం చేకూర్చేలానే ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ బీజేపీ నేతలు బీఆర్ఎస్‌నే టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సైతం కాంగ్రెస్‌, బీజేపీ విమర్శించుకోకూడదని.. ఇద్దరం కలిసి బీఆర్ఎస్‌ను లేకుండా చేయాలంటూ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.

ఇదే విషయమై మాజీ మంత్రి హరీష్‌రావు సైతం తాజాగా ట్విట్టర్‌లో స్పందించారు. కాంగ్రెస్‌ ప్రతిపాదించిన ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ ఒకే చెప్పడాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బయటపడిందన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంతో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బయటపడిందన్నారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్‌కు మేలు చేసే విధంగా గవర్నర్ గారు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు హరీష్‌ రావు.


రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి గవర్నర్ నిరాకరించారని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిని సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారన్నారు హరీష్‌ రావు. ఇది ద్వంద్వ నీతి కాదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించడం కాదా అన్నారు. గతంలో కూడా క్రీడా, సాంస్కృతిక , విద్యా సామాజిక , సేవ రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. అప్పుడు కూడా గవర్నర్ గారు రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదన్నారు. మరి ఇప్పుడు ఎలా ఆమోదించారో చెప్పాలన్నారు హరీష్‌ రావు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌,బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్‌ పార్టీని అణగదొక్కాలని చూస్తున్నాయన్నారు. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం దురదృష్టకరమన్నారు హరీష్‌ రావు. న్యాయసూత్రాలు, రాజ్యాంగ సంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలని..కానీ గవర్నర్ బీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు తేడా చూపిస్తున్నారన్నారు.

First Published:  26 Jan 2024 10:34 AM IST
Next Story