రేవంత్ సవాల్.. హరీష్ రావు కౌంటర్
రాజీనామా చేయలేకపోతే ముక్కు నేలకు రాయాలన్నారు. సిగ్గు లేనోడు అయితే ఏట్లో దూకి సావాలంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు.
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. ఖమ్మం జిల్లా వైరా సభలో చివరి విడత రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. హరీష్ రావును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేశామని, చీము, నెత్తురు.. సిగ్గు, లజ్జ ఉంటే హరీష్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. రాజీనామా చేయలేకపోతే ముక్కు నేలకు రాయాలన్నారు. సిగ్గు లేనోడు అయితే ఏట్లో దూకి సావాలంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు. రాజీనామా చేస్తే సిద్దిపేటలో హరీష్ రావును ఓడించే బాధ్యత తనదన్నారు రేవంత్ రెడ్డి.
హరీష్ రావు నీకు సిగ్గు, లజ్జ ఉంటే రాజీనామా చేయి.. లేకుంటే ఏట్ల దునికి సావు - సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/iCQuXRpBUn
— Telugu Scribe (@TeluguScribe) August 15, 2024
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి సీఎం స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించలేడనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నాడన్నారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణ చరిత్రలో ఇంతగా దిగజారిన దిక్కుమాలిన సీఎం ఇంకెవరూ లేరన్నారు. అబద్ధం కూడా సిగ్గుపడి మూసీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేలా రేవంత్ ప్రవర్తన ఉందన్నారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకుని కూడా మాట మీద నిలబడకపోగా.. నిస్సిగ్గుగా రేవంత్ బీఆర్ఎస్ మీద అవాకులు, చెవాకులు పేలాడంటూ మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేడు అనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుచుకుంటున్నాడు.
— Harish Rao Thanneeru (@BRSHarish) August 15, 2024
• ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని, తెలంగాణ చరిత్రలో గాని ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరు.
•అబద్దం కూడా సిగ్గుపడి మూసి దుంకి ఆత్మహత్య…
అసెంబ్లీ ఎన్నికల ముందు సోనియా పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి 40 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని చెప్పింది రేవంత్ రెడ్డేనని గుర్తు చేసిన హరీష్ రావు.. అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల టైమ్‌లో కొత్త డ్రామాకు తెరలేపాడన్నారు. ఆగస్టు 15 నాటికి 31 వేల కోట్ల మాఫీ చేస్తానని రేవంత్ ఊదరగొట్టాడన్నారు హరీష్ రావు. అంటే దాదాపు 9 వేల కోట్లకు కోత పెట్టిండని గుర్తుచేశారు. అయినా ఎవరూ నమ్మట్లేదని దేవుళ్లపై ఒట్లు పెట్టి ప్రమాణాలు చేశాడన్నారు హరీష్ రావు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి దఫాలో లక్ష రూపాయల రుణమాఫీ 35 లక్షల మంది రైతులకు చేస్తే దాదాపు 17 వేల కోట్లయిందన్న హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తే కేవలం 22 లక్షల మంది రైతులే ఉంటారా అని ప్రశ్నించారు. కేవలం రూ.17 వేల 869 కోట్లు మాత్రమే అవుతాయా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఒక్క విషయంతో కాంగ్రెస్ రుణమాఫీ పచ్చి అబద్ధం అని తేలిపోయిందన్నారు హరీష్ రావు. ఎవరు దగా చేశారన్నది స్పష్టంగా తేలిపోయిందన్న హరీష్ రావు.. ఎవరు రాజీనామా చేయాలో, ఏట్లో దూకి ఎవరు చావాలో చెప్పాలన్నారు. దిగజారుడు భాషలో తిడితే అబద్ధాలు నిజాలైపోవన్నారు. రేవంత్‌కు ఉన్నది వికారమే తప్ప సంస్కారం కాదంటూ మండిపడ్డారు హరీష్ రావు.