Telugu Global
Telangana

రుణమాఫీ గైడ్‌లైన్స్‌పై హరీష్‌ రావు ఫైర్‌

2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 9 మధ్య రుణాలు తీసుకున్నా లేదా రెన్యూవల్ చేసుకున్న వారిని అర్హులుగా గుర్తించింది. వాణిజ్య, గ్రామీణ, సహకార బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

రుణమాఫీ గైడ్‌లైన్స్‌పై హరీష్‌ రావు ఫైర్‌
X

రైతులకు రూ.2 లక్షల లోపు రుణమాఫీకి సంబంధించి రేవంత్ సర్కార్‌ విడుదల చేసిన గైడ్‌లైన్స్‌పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్‌ రావు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన గైడ్‌లైన్స్ చూస్తే.. రైతుల వలపోతల కంటే వడపోతలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట అంటూ మండిపడ్డారు. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అనే పద్ధతి చేయి గుర్తు పార్టీకి అలవాటుగా మారిందంటూ సెటైర్ వేశారు హరీష్ రావు.


డిసెంబర్‌ 12, 2018కి ముందు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించదు అనే నిబంధన సరికాదన్నారు హరీష్ రావు. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వం భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతోందన్నారు. ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు), పీఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం అంటే లక్షలాది మంది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమేనన్నారు. ఎన్నికలప్పుడు మభ్యపెట్టి.. అధికారం చేజిక్కినాక ఆంక్షలు పెట్టారని ఆరోపణలు చేశారు హరీష్ రావు.

ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల లోపు రైతు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా గైడ్‌లైన్స్‌ రిలీజ్ చేసింది ప్రభుత్వం. 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 9 మధ్య రుణాలు తీసుకున్నా లేదా రెన్యూవల్ చేసుకున్న వారిని అర్హులుగా గుర్తించింది. వాణిజ్య, గ్రామీణ, సహకార బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అసలు, వడ్డీ కలిపి 2 లక్షలు ఉంటే పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇక 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే.. పైన ఉన్న మొత్తాన్ని రైతు ముందుగా చెల్లించిన తర్వాత మిగిలిన 2 లక్షల రూపాయలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఇక రుణమాఫీని రేషన్‌ కార్డును ప్రామాణికంగా అమలు చేయనుంది. రుణమాఫీ సొమ్మును నేరుగా రైతు ఖాతాలో జమ చేయనుంది ప్రభుత్వం.

First Published:  15 July 2024 3:49 PM GMT
Next Story