బోనస్ ఇవ్వాల్సింది దొడ్డు వడ్లకే, సన్నాలకు కాదు - హరీష్ రావు
తెలంగాణలో రైతులు దాదాపు 90 శాతం దొడ్డు రకం వడ్లనే పండిస్తారన్నారు హరీష్ రావు. 10 శాతం పండే సన్న వడ్లకు మార్కెట్‌లో మంచి డిమాండు ఉంటుందన్నారు.
సన్నవడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడంపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో హామీని తుంగలో తొక్కిందంటూ ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు నెలకు రూ. 4 వేల రూపాయల భృతి ఇస్తామని హామీ ఇచ్చి.. ఆ మాట ఎక్కడా చెప్పలేదని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని గుర్తుచేశారు. ఇవాళ వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలోనూ పచ్చి అబద్ధం ఆడి, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు హరీష్ రావు. ఈ మేరకు కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్ అంటూ ఓ ట్వీట్ చేశారు.
రైతులు పండించిన వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో భాగంగా హామీ ఇచ్చిందని గుర్తుచేశారు హరీష్ రావు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తాము పండించిన పంట అమ్మకానికి సిద్ధపడి బోనస్ కోసం ఎదురుచూస్తుండగా, వారందరి ఆశలు అడియాసలు చేస్తూ కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని, అది కూడా వచ్చే సీజన్ నుంచి ఇస్తామని ప్రకటించడం అత్యంత బాధాకరమన్నారు హరీష్ రావు.
కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్.
— Harish Rao Thanneeru (@BRSHarish) May 20, 2024
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కింది. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల భృతి ఇస్తామని హామీ ఇచ్చి, మేమా మాట అనలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలో కూడా పచ్చి…
తెలంగాణలో రైతులు దాదాపు 90 శాతం దొడ్డు రకం వడ్లనే పండిస్తారన్నారు హరీష్ రావు. 10 శాతం పండే సన్న వడ్లకు మార్కెట్‌లో మంచి డిమాండు ఉంటుందన్నారు. సన్న వడ్లకు మద్దతు ధర కంటే ఎక్కువగా మార్కెట్‌లో ధర వస్తుందన్నారు. కానీ దొడ్డు బియ్యానికి గిట్టుబాట ధర కూడా రాదన్నారు. కాబట్టి బోనస్ ఇవ్వాల్సింది దొడ్డు వడ్లకేనన్నారు. సన్నరకాలకే బోనస్ ఇస్తామంటే రైతులను దగా చేయడమేనన్నారు. మంత్రుల ప్రకటనతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్ల, వ్యవసాయాభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని స్పష్టమైపోయిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో ఇచ్చినవే తప్ప రైతుల మేలు కోసం ఇచ్చినవి కాదని తేలిపోయిందన్నారు హరీష్ రావు. కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సీజన్ నుంచి అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని కోరారు.