రాజకీయాలే తప్ప.. రైతు ప్రయోజనాలు పట్టవా - హరీష్ రావు
గతంలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి పరామర్శించి, భరోసా కల్పించారని గుర్తుచేశారు. అక్కడికక్కడే ఎకరాకు రూ.10 వేల నష్ట పరిహారం ప్రకటించి అమలు చేశామన్నారు.
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు అన్నదాతను అతలాకుతలం చేశాయన్నారు హరీష్ రావు.
ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింది. పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చింది.
— Harish Rao Thanneeru (@BRSHarish) March 19, 2024
వరి, మొక్కజొన్న, జొన్న పంటలతోపాటు… pic.twitter.com/KQAMv1kKz5
పంటలు చేతికందే సమయంలో కురిసిన వర్షాలు రైతులకు కన్నీరు మిగిల్చాయన్నారు. వరి, మొక్కజొన్న, జొన్న పంటలతో పాటు బొప్పాయి, మామిడి లాంటి ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. గతంలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి పరామర్శించి, భరోసా కల్పించారని గుర్తుచేశారు. అక్కడికక్కడే ఎకరాకు రూ.10 వేల నష్ట పరిహారం ప్రకటించి అమలు చేశామన్నారు. అందుకు సంబంధించిన వివరాలను ట్వీట్‌లో పోస్టు చేశారు హరీష్ రావు.
రెండు, మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైందన్నారు. రాజకీయాలు తప్ప, రైతు ప్రయోజనాలు కాంగ్రెస్‌కు పట్టవా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా మేల్కొని రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయడంతో పాటు.. ఎకరాకు రూ. 10 వేల నష్ట పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.