Telugu Global
Telangana

రేవంత్‌పై మాజీ డీఎస్పీ నళిని ఘాటు వ్యాఖ్యలు

మధ్యల తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలు కూడా జరిగాయి. ఆశ్చర్యంగా నా ఊసే ఎత్తలేదు. ఇంతకీ నా రెండు దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నాయో, లేక చెత్త బుట్టలోకి పోయినవోనని డౌట్ వస్తోంది.

రేవంత్‌పై మాజీ డీఎస్పీ నళిని ఘాటు వ్యాఖ్యలు
X

మాజీ డీఎస్పీ నళిని మరోసారి వార్తల్లో నిలిచారు. సీఎం రేవంత్‌ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. నెల రోజుల్లోనే తన పిటిషన్‌పై ఎంక్వైరీ పూర్తి చేస్తారని భావించానని, కానీ 7 నెలలు పూర్తవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తన రెండు దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నాయా, చెత్త బుట్టలోకి పోయాయా అని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం సార్‌ బాధ్యతలు తీసుకోగానే తనను గుర్తు చేశారని, ఇప్పుడేమో సప్పుడు చేయట్లేదంటూ మండిపడ్డారు నళిని. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లోనూ తన ఊసే ఎత్తలేదన్నారు నళిని.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్‌ రెడ్డి మాజీ డీఎస్పీ నళినిని పిలిపించుకుని మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తిరిగి డీఎస్పీ ఉద్యోగం ఎందుకు ఇవ్వకూడదనే అంశంపై ఆరా తీశారు. పోలీసు ఉద్యోగం కుదరకపోతే…అదే స్థాయిలో ఉండే మంచి ఉద్యోగాన్ని ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో నళినితో మాట్లాడాలని అధికారులకు సూచించారు. ఇక నళిని సైతం ఆధ్యాత్మిక ప్రచారానికి సాయంతో పాటు తన సర్వీస్‌ అంశానికి సంబంధించిన లేఖలను రేవంత్‌కు ఇచ్చింది. అయితే ఈ రెండు లేఖలపై ఇప్పటివరకూ పురోగతి లేకపోవడంతో ఆమె సోషల్‌మీడియా వేదికగా హాట్ కామెంట్స్ చేశారు.


నళిని ఫేస్‌బుక్‌ పోస్టు ఇదే!

సీఎం సార్‌ కొలువుకు ఎక్కగానే నన్ను మీద మీద యాది చేసిండు. ఇప్పుడేమో సప్పుడే చేస్తలేడు. మధ్యల తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలు కూడా జరిగాయి. ఆశ్చర్యంగా నా ఊసే ఎత్తలేదు. ఇంతకీ నా రెండు దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నాయో, లేక చెత్త బుట్టలోకి పోయినవోనని డౌట్ వస్తోంది. ఇప్పుడే చీఫ్‌ CROను OSD సర్‌ను కదిలించిన. చిట్టి రాసిన. మా చిన్నప్పుడు అడుక్కునేటోడు ఇంటి ముందుకు వస్తే ఇంట్లో చలన్నం లేకపోతే ఎల్లవయ్య అని మెల్లగా చెప్పటోళ్లం. కనీసం ఆ పాటి మర్యాద అయినా నాకు ఇస్తారేమో చూడాలి. అందుకే నేను ఇన్నేళ్లు ఎవరినీ కలవలే. ఉద్యమం చేసేటప్పుడే చాలా విషయాలు అర్థం అయ్యాయి. ఒక నెలలో నా పిటిషన్ ఎంక్వైరీ పూర్తి చేస్తారనుకున్నా. 7 నెలలు కావొస్తుంది. అందుకే రిమైండర్ లెటర్‌, పోస్టు రాయాల్సి వచ్చింది. సెక్రటేరియట్ చుట్టూ తిరిగేంత సమయం, ఓపిక నా దగ్గర లేవు అని ఆ రోజే రేవంతన్నకు చెప్పిన.

ఉద్యమ సమయంలో.. డీఎస్పీ పదవికి రాజీనామా చేసి సంచలనంగా మారారు నళిని. స్వ‌రాష్ట్ర సాధన పోరాటంలో కీలకంగా మారారు. ఉద్యమ సమయంలో పరకాల ఉపఎన్నికలో కూడా పోటీ చేశారు. అయితే రాష్ట్రం వచ్చిన తర్వాత నళిని పెద్దగా కనిపించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మరోసారి నళిని వార్తల్లో నిలిచారు.

First Published:  21 July 2024 6:41 AM GMT
Next Story