Telugu Global
Telangana

మల్కాజ్‌గిరి నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ?

దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న లోక్‌సభ నియోజకవర్గంగా రికార్డులకు ఎక్కిన మల్కాజ్‌గిరి నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

మల్కాజ్‌గిరి నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ?
X

ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బీజేపీలో చేరి తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి ప్రయత్నించి.. తెలంగాణ సమాజం ఆగ్రహానికి గురయ్యారు. తెలంగాణ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా బడ్జెట్‌లో కేటాయించనని అసెంబ్లీలోనే ప్రకటించారు. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీలో 'జై సమైక్యాంధ్ర పార్టీ' (జేఎస్పీ)ని ఏర్పాటు చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎస్పీని బరిలోకి దింపారు. తాను పోటీ చేయకుండా.. తమ్ముడు నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డిని పీలేరు నుంచి బరిలో నిలిపారు. ఆ ఎన్నికల్లో జేఎస్పీ ఒక్క సీటు కూడా గెలవలేదు.

2014 తర్వాత రాజకీయాలకు దూరమైన నల్లారి.. తిరిగి తన సొంత పార్టీ కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీలో చేరినా.. క్రియాశీల రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటూనే వచ్చారు. తాజాగా నల్లారి బీజేపీలో చేరారు. నల్లారి కిరణ్ కుమారె రెడ్డిని తాము రెండు రాష్ట్రాల్లో ఉపయోగించుకుంటామని బీజేపీ నాయక్వం వ్యాఖ్యానించింది. సీఎంగా పని చేసినప్పుడు తెలంగాణపై అమితమైన ద్వేషం చూపించిన నల్లారి.. ఇప్పడు అదే తెలంగాణ ప్రాంతం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.

దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న లోక్‌సభ నియోజకవర్గంగా రికార్డులకు ఎక్కిన మల్కాజ్‌గిరి నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. రేవంత్ రెడ్డి ఒక వేళ కొడంగల్ నుంచి గెలిస్తే.. మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ లేదు. ఇక బీఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డే బరిలో ఉండే అవకాశం ఉన్నది. బీజేపీ నుంచి 2019 ఎన్నికల్లో నారపరాజు రామచందర్ రావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు.

మల్కాజ్‌గిరి పార్లమెంటు పరిధిలోకి వచ్చే కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, మేడ్చెల్ నియోజకవర్గాల్లో సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. సమైక్యాంధ్ర ఛాంపియన్‌గా మారాలని భావించి, బొక్కాబోర్లా పడిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఈ సారి సెటిలర్లను నమ్ముకున్నట్లు తెలుస్తున్నది. ఏపీలోని పీలేరు నుంచి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి బరిలో ఉండే అవకాశం ఉన్నది. ఎమ్మెల్యేగా కాకుండా ఈ సారి ఎంపీగా పోటీ చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే మల్కాజ్‌గిరి సరైన ఎంపిక అని బీజేపీ వర్గాలు కూడా భావిస్తున్నాయి.

బీజేపీ ప్రతిపాదనకు నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. బీజేపీ బలంతో పాటు సెటిలర్ల ఓట్లు తనను గెలిపిస్తాయని అంచనా వేసుకుంటున్నారు.అయితే, కిరణ్ కుమార్ రెడ్డి కేవలం సెటిలర్ల ఓట్లపై నమ్మకంతో బరిలోకి దిగితే గెలవడం కష్టమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. సెటిలర్లు ఇప్పటికే బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నారని.. ఆ పార్టీతో ఎలాంటి విభేదాలు లేనప్పుడు ఇతర పార్టీల వైపు చూసే అవకాశం ఉండదని అంటున్నారు. గతంలో ఇలాగే సెటిలర్ల ఓట్లు నమ్ముకొని కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా సుహాసిని పోటీ చేశారని.. కానీ ఆమె చిత్తుగా ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత ప్రాంతమైన ఏపీలోనే ఒక సేఫ్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. బీజేపీకి తెలంగాణలో ఎలాంటి బలం లేదని.. ఆ పార్టీని నమ్మి మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తే చివరకు డిపాజిట్లు పోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

First Published:  18 April 2023 10:04 AM IST
Next Story