Telugu Global
Telangana

తెలంగాణ విద్యుత్ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ సీజేఐ

విచారణ కొనసాగుతుండగా ఛైర్మన్‌గా ఉన్న నరసింహా రెడ్డి మీడియాతో మాట్లాడడం వివాదాస్పదమైంది. దీనిపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

తెలంగాణ విద్యుత్ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ సీజేఐ
X

సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ విద్యుత్ కమిషన్‌కు కొత్త ఛైర్మన్‌ను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. జస్టిస్ నరసింహా రెడ్డి స్థానంలో జస్టిస్ మదన్‌ బి లోకూర్‌ను ఛైర్మన్‌గా నియమించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈ కమిషన్ విచారణ జరపనుంది.

విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలపై విచారణ జరిపేందుకు రేవంత్ సర్కార్‌ 2024 మార్చి 14న కమిషన్‌ ఏర్పాటు చేసింది. దీనికి జస్టిస్ నరసింహా రెడ్డిని ఛైర్మన్‌గా నియమించింది. విచారణ ప్రారంభించిన కమిషన్‌ మాజీ సీఎం కేసీఆర్‌ సహా 25 మందికి నోటీసులు ఇచ్చింది. అయితే విచారణ కొనసాగుతుండగా ఛైర్మన్‌గా ఉన్న నరసింహా రెడ్డి మీడియాతో మాట్లాడడం వివాదాస్పదమైంది. దీనిపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

జస్టిస్ నరసింహా రెడ్డి మీడియాతో మాట్లాడడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేసీఆర్. జూలై 16న కేసీఆర్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు బెంచ్‌.. జస్టిస్ నరసింహారెడ్డి మీడియా సమావేశం నిర్వహించడాన్ని తప్పు పట్టింది. విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌గా ఆయనను తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో నరసింహా రెడ్డి రాజీనామా చేశారు. తాజాగా జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ను విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌గా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. మదన్‌ బి లోకూర్‌ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. అనంతరం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గానూ విధులు నిర్వహించారు.

First Published:  31 July 2024 7:12 AM IST
Next Story