స్కిల్ వర్సిటీ నిర్వహణకు రూ. 100 కోట్లు కేటాయిస్తాం: సీఎం రేవంత్
ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే పలు కోర్సుల వివరాలను అధికారులు పారిశ్రామికవేత్తలకు వివరించారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున రూ. 100 కోట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, వర్సిటీ బోర్డు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కీలకాంశాలను అధికారులు పారిశ్రామిక వేత్తలకు అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున రూ. 100 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటునకు ముందుకు రావాలని కోరారు. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాల్లో యూనివర్సిటీ నిర్వహణకు సహకారం అందించాలన్నారు. ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే పలు కోర్సుల వివరాలను అధికారులు పారిశ్రామికవేత్తలకు వివరించారు.
వర్సిటీ బోర్డు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని కొనియాడారు. నైపుణ్యాలు పెంపొందించాలన్న సీఎం ఆలోచన గొప్పది. రేవంత్ విజన్ ఉన్న నాయకుడిని ఆనంద్ మహీంద్ర ప్రశంసించారు.