Telugu Global
Telangana

దేశంలోనే తొలి సారి అడవి జంతువుల కదలికలు గుర్తించేందుకు ఏఐ బేస్డ్ సాఫ్ట్‌వేర్.. ప్రయోగాత్మకంగా పరిశీలించిన ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్

అడవి జంతువుల కదలికలపై నిఘా వేసే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దేశంలో ఇలాంటి సాఫ్ట్‌వేర్ వాడటం ఇదే మొదటి సారి.

దేశంలోనే తొలి సారి అడవి జంతువుల కదలికలు గుర్తించేందుకు ఏఐ బేస్డ్ సాఫ్ట్‌వేర్.. ప్రయోగాత్మకంగా పరిశీలించిన ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్
X

అడవుల్లో జంతువుల వేటను అరికట్టడానికి, టూరిజాన్ని మరింతగా ప్రోత్సహించడానికి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అనేక చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా అడవి జంతువులను వేటగాళ్ల బారి నుంచి రక్షించడానికి కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అడవుల్లో కెమేరాలు ఏర్పాటు చేసి.. వాటిని నిత్యం ప్రాసెసింగ్ చేస్తున్నారు. అయితే లక్షల సంఖ్యలో ఉండే ఫొటోలను ప్రాసెస్ చేయడం ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు భారంగా మారింది. దీన్ని నివారించడానికి అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. థింక్ ఇవాల్స్ అనే టెక్నాలజీ కంపెనీ సాయంతో డికాట్రాన్ (DeCaTron) అనే సాఫ్ట్‌వేర్ రూపొందించింది.

అడవి జంతువుల కదలికలపై నిఘా వేసే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దేశంలో ఇలాంటి సాఫ్ట్‌వేర్ వాడటం ఇదే మొదటి సారి. ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో లక్షలాది ఇమేజెస్‌ను తక్కువ సమయంలోనే రియల్‌టైంలో ప్రాసెస్ చేసే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. జంతువుల కదలికలను నిత్యం పర్యవేక్షించడానికి కొత్త సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుంది. ఫారెస్ట్ బయోడైవర్సిటీ కన్‌సర్జ్వేషన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రస్తుతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో 40 లక్షల ఇమేజెస్‌ను కేవలం ఒక వారంలోనే ప్రాసెస్ చేశారు. ఇప్పటి వరకు 20 రకాల అడవి జంతువులను కెమేరాల్లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతం పులులపై మాత్రం నిఘా పెట్టలేదని చెప్పారు.

తెలంగాణ ఐటీ శాఖకు చెందిన ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగపు డైరెక్టర్ రమాదేవి దీనికి సంబంధించిన వివరాలు తెలియజేశారు. 2020 నుంచి ఏఐ టెక్నాలజీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ టెక్నాలజీని పరిశీలించడానికి అటవీ శాఖ అధికారులను సంప్రదించినప్పుడు వాళ్లు సానుకూలంగా స్పందించారు. అడవుల్లో ఏర్పాటు చేసిన కెమేరా ట్రాప్స్ నుంచి లక్షలాది ఫొటోలు వస్తున్నాయి. వాటన్నింటినీ ప్రాసెస్ చేయాలని వారు కోరారు.

అడవుల్లో ప్రతీ చోట కెమేరాలు పెట్టడం వల్ల జంతువులు భయపడే అవకాశం ఉంటుంది. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి.. చాలా తక్కువ ప్రదేశాల్లో ఎక్కువ ఇమేజెస్ తీసే కెమేరాలు ఏర్పాటు చేశారు. డికాట్రాన్ ఈ ఫొటోలను ఆటోమెటిక్‌గా ప్రాసెస్ చేసి.. పలు రకాల జంతువులకు సంబంధించి వివరాలు వేర్వేరుగా ఇస్తుంది. ఇప్పటికే వచ్చిన ఇమేజీల సహకారంతో ఎంతో డేటాను విశ్లేషించామని రమాదేవి చెప్పారు.

ప్రస్తుతం అడవుల్లో ఏర్పాటు చేసిన కెమేరా ట్రాప్స్‌ను ఉపయోగించి జంతువులు, గాలి వీయడం వల్ల వచ్చే చెట్ల కదలికలకు మధ్య తేడాను గుర్తించలేము. వీటిని సాధారణ మనిషి కంటితో విశ్లేషించడం కష్టం. మరోవైపు 100లో 12 ఫొటోలు మాత్రమే జంతువుల కదలికలతో ఉంటాయి. వారంలో 40 లక్ష ఫొటోలను పరిశీలించడం కూడా అధికారులకు కష్టమే. అదే ఏఐని ఉపయోగించి 40 లక్షల ఫొటోలను వారంలోనే ప్రాసెస్ చేశాము. ఇందులో 40 వేల ఫొటోల్లో మాత్రమే జంతువుల కదలికలు ఉన్నట్లు థింక్ ఇవాల్వ్ సీఈవో ఆకాశ్ గుప్త వివరించారు.

ప్రస్తుతం 20 రకాల జంతువులను ఏఐ ద్వారా గుర్తించాము. రాబోయే రోజుల్లో మరిన్ని జంతువులను గుర్తించేలా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీని వల్ల ఏయే ప్రాంతాల్లో ఏ జంతువుల సంచారం ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. అంతే కాకుండా ఫారెస్ట్ అధికారులు, ఉద్యోగులపై భారం చాలా వరకు తగ్గుతుందని ఆకాశ్ గుప్త చెప్పారు. అడవుల్లో సంభవించే అగ్నిప్రమాదాలు, ఇతర ప్రమాదాలను త్వరగా గుర్తించే అవకాశం కూడా ఉంటుందని.. పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

ఈ కెమేరా ట్రాప్ ఇమేజీలను అత్యంత భద్రత కలిగిన సర్వర్లలో నిక్షిప్తం చేస్తామని.. ఇతరులకు ఈ సమాచారం అందుబాటులో ఉండదని ఆయన పేర్కొన్నారు. ఇక టూరిజం హాట్ స్పాట్స్, బర్డ్స్ వాచింగ్, యానిమల్ కాంఫ్లిక్ట్ జోన్లను గుర్తించేందుకు ఈ సాఫ్ట్ వేర్ చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు.

First Published:  8 May 2023 7:48 AM IST
Next Story