ఆదాయం పెంచడంపై దృష్టి పెట్టండి
ఇసుక, ఫ్లైయాష్ వాహనాలను తనిఖీ చేయండి : అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం
రవాణాశాఖ ఆదాయం పెంచడంపై అధికారులు దృష్టి పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బుధవారం సెక్రటేరియట్ లో ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. టార్గెట్ కు అనుగుణంగా ఆదాయం ఎలా సాధించాలనే మార్గాలను అన్వేషించాలన్నారు. స్క్రాప్ పాలసీ, ఆటోమాటిక్ టెస్టింగ్ స్టేషన్స్ సహా రవాణా పాలసీపై అధికారులు సమర్పించిన నివేదికపై సమావేశంలో చర్చించారు. ఇసుక, ఫ్లై యాష్ వాహనాలు ఓవర్ లోడ్ తో వెళ్తున్నాయో లేదో వేయింగ్ మిషన్ లతో చెక్ చేయించాలని సూచించారు. స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ఆటోల్లో ఓవర్ లోడ్ తో విద్యార్థులు తీసుకెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఈమేరకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రతి రోజు 20 మంది మృతిచెందుతున్నారని, యాక్సిడెంట్లు, మరణాలను తగ్గించడానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో అధికారులు వికాస్ రాజ్, ఇలంబరితి, రమేశ్, మమత తదితరులు పాల్గొన్నారు.