గోదావరికి భారీ వరద..
బుధవారం రాత్రి భద్రాచలం వద్ద 35.20 అడుగుల మేర ప్రవాహం ఉంది. దాదాపు 6 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది.
గంగ, యమున.. ఉత్తరాదిని వణికిస్తున్నాయి. ఇటు దక్షిణాదిలో గోదావరి భారీ వరదనీటితో పరవళ్లు తొక్కుతోంది. ప్రాణహిత, ఇంద్రావతి నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరిలోకి వరదనీరు వచ్చి చేరింది. భద్రాచలం వద్ద ఆరు లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దాటిపోయింది. గోదావరిలో ఎగువన పెద్దగా ప్రవాహం లేకపోయినా.. కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది కలసిన తర్వాత వరదనీరు భారీగా చేరుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది. చత్తీస్ ఘడ్ లో కురిసిన వర్షాలకు ఇంద్రావతి నుంచి వరదనీరు వచ్చి గోదావరిలో కలుస్తోంది. తాలిపేరు నుంచి 60వేల క్యూసెక్కుల నీరు వచ్చి గోదావరిలో కలుస్తోంది.
నీటి విడుదల..
కాళేశ్వరం.. మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీటిని కిందకు వదులుతున్నారు. 46 గేట్లు ఎత్తి 3.84 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. సమ్మక్కసాగరం బ్యారేజీ 45 గేట్లు ఎత్తి 4.75 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నారు. బుధవారం రాత్రి భద్రాచలం వద్ద 35.20 అడుగుల మట్టంతో ప్రవాహం ఉంది. దాదాపు 6 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ఇటు పోలవరం వద్ద లక్షా 65 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. శ్రీరామసాగర్, కడెం ప్రాజెక్ట్ లకు కూడా భారీగా నీరు చేరింది. సింగూరు, నిజాంసాగర్ లోకి కూడా ప్రవాహం చేరుకుంటోంది.
భద్రాచలం అప్రమత్తం..
గోదావరికి భారీగా వరదనీరు వచ్చి చేరడం, మరో రెండుమూడు రోజుల్లో ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఇటు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.