తెలంగాణలో ఫ్లెక్సీ వార్.. ఉద్యమకారుల ఫొటోలతో బ్యానర్లు
"ఉద్యమకారులను బలితీసుకున్న కాంగ్రెస్ పార్టీని బతకనీయొద్దు" అంటూ నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. శ్రీకాంతా చారి బలిదానం ఫొటోతోపాటు.. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఫొటోలను కూడా వాటిపై ముద్రించారు.
తెలంగాణలో మళ్లీ ఫ్లెక్సీ వార్ మొదలైంది. ఆమధ్య బీజేపీ, కాంగ్రెస్ నేతలు తెలంగాణకు వచ్చే సమయంలో ఇలాంటి ఫ్లెక్సీలు అక్కడక్కడా కనపడేవి. తాజాగా రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కూడా ఫ్లెక్సీలు కలకలం రేపాయి. రాహుల్ రాకను నిరసిస్తూ ఫ్లెక్సీలు వేశారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద కూడా ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. తాజాగా మళ్లీ నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలు కనిపించాయి.
చిదంబరం వ్యాఖ్యల నేపధ్యంలో కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఉద్యమకారుల బలిదానాల్ని మరోసారి తెలంగాణ ప్రజలకు గుర్తు చేసి మరీ కాంగ్రెస్ తనకు తానుగా కార్నర్ అయింది. ఉద్యమకారుల్ని బలితీసుకున్నది తామేనంటూ మరోసారి ఎన్నికల వేళ కాంగ్రెస్ గుర్తు చేసినట్టయింది. దీంతో ఆ పార్టీకి వ్యతిరేకంగా నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి.
ఉద్యమకారులను బలితీసుకున్న కాంగ్రెస్ పార్టీని బతకనీయొద్దు అంటూ నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. శ్రీకాంతా చారి బలిదానం ఫొటోతోపాటు.. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఫొటోలను కూడా వాటిపై ముద్రించారు. ఈ ఫొటోలు కాంగ్రెస్ నేతల్ని ఇబ్బంది పెడుతున్నాయి. రాజకీయంగా ఆ పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి.