Telugu Global
Telangana

రేపటినుంచి చేప ప్రసాదం.. ఈరోజే తరలి వచ్చిన జనం

బత్తిని కుటుంబీకుల ద్వారా రేపు ఉదయం 7గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ మొదలవుతుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఏర్పాట్లన్నీ పగడ్బందీగా పూర్తి చేశామని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.

రేపటినుంచి చేప ప్రసాదం.. ఈరోజే తరలి వచ్చిన జనం
X

మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రేపటి(శుక్రవారం)నుంచి చేప ప్రసాదం పంచిపెడతారు. కరోనా వళ్ల కొన్నేళ్లుగా చేప ప్రసాదం పంపిణీ అధికారికంగా చేపట్టలేదు. ఈ ఏడాది విస్తృత ప్రచారంతో ఇతర రాష్ట్రాలనుంచి కూడా జనం భారీగా తరలి వస్తున్నారు. ముందుగానే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు చేరుకుని, అక్కడే బస చేస్తున్నారు. మృగశిర కార్తె ప్రవేశ సమయంలో చేప ప్రసాదం తీసుకుంటే ఉబ్బసం వ్యాధి తగ్గిపోతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. అందుకే ఒకరోజు ముందుగానే వారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి చేరుకున్నారు. చేప ప్రసాదం పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. వృద్ధులు, వికలాంగులు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్లు ఉన్నాయి.

పక్కా ఏర్పాట్లు..

బత్తిని కుటుంబీకుల ద్వారా రేపు ఉదయం 7గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ మొదలవుతుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఏర్పాట్లన్నీ పగడ్బందీగా పూర్తి చేశామని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. ఇప్పటికే పలుమార్లు ఆయన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి చేరుకుని ఏర్పాట్లు పరిశీలించారు. చేప ప్రసాదం పంపిణీకి ఆర్‌ అండ్‌ బీ అధికారులు షెడ్లు, ఫ్లడ్‌ లైట్లు, బ్యారికేడ్లు.. ఏర్పాటు చేయగా.. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభిస్తారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఎగ్జిబిషన్‌ మైదానంలో చేప ప్రసాదం పంపిణీని విజయవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మంచినీటి సౌకర్యం కల్పించారు, మరుగుదొడ్లు, శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టారు.

ప్రత్యేక బస్సులు, ట్రాఫిక్ ఆంక్షలు..

ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ లో చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా ఇప్పటికే నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ మొదలైంది. ఈనెల 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. ఈ నెల 8 నుంచి 10 వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తూ ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, ఈసీఐఎల్‌ క్రాస్ రోడ్‌, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వంటి ప్రాంతాల నుంచి దాదాపు 50 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే మరో 14 ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ వరకు 80 బస్సులు ఏర్పాటు చేశారు.

First Published:  8 Jun 2023 6:19 PM IST
Next Story