తెలంగాణలో మరో సుజల దృశ్యం.. పాలమూరు డ్రైరన్ సక్సెస్..!
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్ పంప్‌హౌస్‌లోని మొదటి మోటార్ డ్రైరన్ విజయవంతమైంది. తొమ్మిది మోటర్లలో మొదటి మోటార్ డ్రైరన్‌ను ఇంజినీర్లు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు.
తెలంగాణ సాగునీటి రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్ పంప్‌హౌస్‌లోని మొదటి మోటార్ డ్రైరన్ విజయవంతమైంది. తొమ్మిది మోటర్లలో మొదటి మోటార్ డ్రైరన్‌ను ఇంజినీర్లు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. డ్రైరన్ సక్సెస్ కావడంతో త్వరలోనే వెట్ రన్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వీలైనంత త్వరగా వెట్ రన్ పూర్తి చేసి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నీటిని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి మొత్తం ఆరు దశల్లో నీటిని ఎత్తిపోస్తారు. దీనికి సంబంధించిన పనులను మొత్తం 21 ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు 18 ప్యాకేజీల పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగు పంప్‌హౌజ్‌లు నిర్మిస్తారు. ఇప్పటికే నార్లాపూర్, ఏదుల, వట్టెం పంప్‌హౌజ్‌ల నిర్మాణం ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. నార్లాపూర్ పంప్‌హౌజ్‌లో 145 మెగావాట్ల సామర్థ్యమున్న 9 పంపులను ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఏదుల, వట్టెం పంప్‌హౌజ్‌లలో 9+1 చొప్పున పంపులను, ఉద్దండాపూర్‌లో 4+1 పంపులను అమర్చాల్సి ఉంది. ఇప్పటికే నార్లాపూర్ పంప్‌హౌజ్‌లో 2, ఏదులలో 3, వట్టెంలో 3 పంపుల అమరిక పూర్తయింది. ఈ నేపథ్యంలోనే నార్లాపుర్ పంప్‌హౌజ్‌లో అమర్చిన మొదటి పంప్ డ్రైరన్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 12 లక్షల 22 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిపాదించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ దగ్గర శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను తీసుకుంటారు. మొత్తం 90 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు.
♦