నడిరోడ్డుపై ఆర్టీసీ ఏసీ బస్సు ఫైర్.. స్కూటీని ఢీకొనడంతో ఘటన
హైదరాబాద్ మియాపూర్ డిపోకు చెందిన బస్సు మియాపూర్ నుంచి విజయవాడకు గురువారం ఉదయం ప్రయాణికులతో బయలుదేరింది.
నడిరోడ్డుపై ఆర్టీసీ ఏసీ బస్సు దగ్ధమైంది. స్కూటీని ఢీకొనడంతో దానినుంచి పెట్రోల్ లీకై మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతుండగా సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమవగా, ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. స్కూటీ నడుపుతున్న వ్యక్తి మాత్రం అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ మియాపూర్ డిపోకు చెందిన బస్సు మియాపూర్ నుంచి విజయవాడకు గురువారం ఉదయం ప్రయాణికులతో బయలుదేరింది. బస్సు సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ వద్దకు వచ్చేసరికి ఓ స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీ బస్సు కిందికి వెళ్లిపోయింది. ఎండ ఎక్కువగా ఉండటం, స్కూటీ రోడ్డుకు గీసుకోవడంతో మంటలు చెలరేగాయి.
ఇదే క్రమంలో స్కూటీ పెట్రోల్ ట్యాంక్ లీకవడంతో మంటలు విపరీతమయ్యాయి. అవి బస్సుకు కూడా అంటుకోవడంతో వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులను అందరినీ బస్సు దిగిపోవాలని సూచించాడు. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రయాణికులు, బస్సు డ్రైవర్, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.