Telugu Global
Telangana

ప్రతీ చేనేత కార్మికుడికి నెలకు రూ.3,000 ఆర్థిక సాయం : మంత్రి కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లోని కార్మికులను బతికించుకోవడానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.

ప్రతీ చేనేత కార్మికుడికి నెలకు రూ.3,000 ఆర్థిక సాయం : మంత్రి కేటీఆర్
X

తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది. ఈ నెల నుంచి ప్రతీ మగ్గానికి నెలకు రూ.3,000 ఆర్థిక సాయాన్ని చేనేత మిత్ర పథకం ద్వారా అందించనున్నట్లు మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మన్నెగూడలోని బీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రత్యేక సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లోని కార్మికులను బతికించుకోవడానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. చేనేతపై 5 శాతం జీఎస్టీ వేసిన ఘనత ప్రధాని మోడీదని.. కానీ మన సీఎం కేసీఆర్‌కు చేనేత కార్మికుల కష్టాలు తెలుసని మంత్రి చెప్పారు. చిన్నప్పుడు కేసీఆర్ ఒక పద్మశాలి కుటుంబంలో ఉండి చదువుకున్నారు. అప్పుడే వారి కష్టాలను దగ్గర నుంచి చూశారని పేర్కొన్నారు. అందుకే చేనేతలను ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

రైతులకు రైతు బీమా చేయించిన మాదిరిగానే.. చేనేతలకు నేతన్న బీమా అందిస్తున్నామని అన్నారు. 59 ఏళ్ల పైబడిన వారికి ప్రభుత్వమే బీమా చేయించి ఇస్తుందని చెప్పారు. రూ.25వేల విలువైన చేనేత హెల్త్ కార్డులను కూడా ప్రభుత్వం ఇవ్వబోతోందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రైమ్ మగ్గాలు ఏర్పాటు చేయడానికి రాబోయే రోజుల్లో రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు అందించనున్నట్ల కేటీఆర్ చెప్పారు. దీని ద్వారా ఒక్కో మగ్గానికి రూ.38 వేలు ఇస్తామని అన్నారు.

చేనేత కార్మికులకు ఐడీలు జారీ చేశామని.. అలాగే టెస్కో ద్వారా వీవర్ మెంబర్స్‌కు ఎక్స్‌గ్రేషియా కూడా పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 25వేల మంది నేత కార్మికుల కోసం గృహ లక్ష్మి పథకాన్ని తీసుకొని వస్తామని హామీ ఇచ్చారు. చాలా మంది కార్మికులు సూరత్ వెళ్లారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో ఇప్పుడు వాళ్లు ఇక్కడ పారిశ్రామిక వేత్తలుగా మారినట్లు మంత్రి చెప్పారు. ఉప్పల్ భగాయత్‌లో త్వరలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పోచంపల్లిలోని హ్యాండ్లూమ్ పార్కును రూ.12.60 కోట్లతో పునరుద్దరిస్తామని అన్నారు. ఇక వరంగల్‌లో మెగా కాకతీయ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేశాము. దాని ద్వారా ఎంతో మంది చేతన్నలకు ఉపాధి దొరుకుతోంది. అలాగే చాలా మంది చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారని మంత్రి అన్నారు.

చేనేత భవన నిర్మాణానికి శంకుస్థాపన..

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉప్పల్ శిల్పారామంలో చేనేత భవన్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 500 గజాల్లో నిర్మించనున్న ఈ భవనంలో చేనేత వస్త్రాల వ్యాపార నిర్వహణ, క్రయ విక్రయదారుల సమావేశాలు, సదస్సులు ఏర్పాటు చేసుకోవడానికి కన్వెన్షన్ సెంటర్ నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్. రమణ తదితరులు పాల్గొన్నారు.

First Published:  7 Aug 2023 4:06 PM IST
Next Story