ఎట్టకేలకు నియామక పత్రాలు అందుకోనున్న ఏఈఈ అభ్యర్థులు
సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్న 700 మంది. 18 వందల లష్కర్ పోస్టుల భర్తీపై ప్రకటనకు ఛాన్స్
నీటి పారుదల శాఖలో కొత్తగా చేరబోయే ఏఈఈలకు సీఎం రేవంత్‌రెడ్డి నేడు నియామకపత్రాలు అందజేయనున్నారు. హైదరాబాద్ జలసౌధలో జరిగే కార్యక్రమంలో 700 మంది ఏఈఈలు నియామక పత్రాలు అందుకుంటారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాటు సలహాదారులు, ఉన్నతాధికారులు, ఈఎన్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ 18 వందల లష్కర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనంతరం ప్రాధాన్య ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
కొత్తగా ఆరు లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టుల పనుల పురోగతిని సీఎం సమీక్షిస్తారు. నల్గొండ జిల్లాలో ఎస్‌ఎల్‌బీసీ, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు-రంగారెడ్డి సహా ఇతర ప్రాజెక్టులను మంత్రులు తాజాగా సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనుల వేగానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం మంత్రులతో కలిసి నిర్ణయం తీసుకోనున్నారు. నీటిపారుదల శాఖలో ఏఈ నుంచి ఈఎన్సీ వరకు అన్నిస్థాయిల ఇంజినీర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసింది అయినా ఇప్పటికీ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వ లేదు. అభ్యర్థులు మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయింది. దీంతో తమకు నియామక పత్రాలు ఇవ్వాలని ఇటీవల ఏఈఈ అభ్యర్థుల గాంధీభవన్ వద్ద ధర్నా చేశారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ కూడా వారికి నియామకపత్రం అందించాలని ప్రభుత్వం డిమాండ్ చేసింది. వారి ధర్నాకు సంఘీభావం ప్రకటించింది. ఎట్టకేలకు ప్రభుత్వం వారికి ఇవాళ నియామక పత్రాలు అందించనున్నది.