Telugu Global
Telangana

కాంగ్రెస్‌ ఫైనల్ లిస్ట్‌ ఇదే.. ఇవాళే రిలీజ్‌.!

కామారెడ్డిలో రేవంత్ పోటీ చేస్తే.. షబ్బీర్‌ అలీని నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలో దింపుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ స్థానం డీఎస్ కుమారుడు సంజయ్‌ టికెట్ ఆశిస్తున్నారు.

కాంగ్రెస్‌ ఫైనల్ లిస్ట్‌ ఇదే.. ఇవాళే రిలీజ్‌.!
X

సీపీఐతో పొత్తు ఓకే కావడంతో ఫైనల్‌ లిస్టుపై దృష్టి పెట్టింది కాంగ్రెస్‌. ఇప్పటివరకూ రెండు విడతల్లో 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 19 స్థానాల్లో సీపీఐకి ఒక స్థానం కేటాయించగా.. మరో 18 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. నామినేషన్ల స్వీకరణకు మరో 5 రోజులు మాత్రమే గడువు ఉండటంతో 18 స్థానాలకు ఇవాళ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది.

సీపీఐకి కొత్తగూడెం స్థానం కేటాయించనున్నారు. మిగిలిన 18 పెండింగ్‌ స్థానాల్లో తుంగతుర్తి, సూర్యాపేట, కామారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్ అర్బన్, కరీంనగర్, చెన్నూరు, నారాయణ ఖేడ్‌, బాన్సువాడ, జుక్కల్, పటాన్ చెరు, డోర్నకల్‌, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లందు, వైరా, చార్మినార్‌కు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

సూర్యాపేట టికెట్ కోసం పటేల్ రమేష్ రెడ్డి, దామోదర్ రెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఈ సీటును ఇవాళ ప్రకటించే అవకాశం లేదని తెలుస్తోంది. తుంగతుర్తి టికెట్‌ రేసులోనూ ఆశావహులు భారీగా ఉన్నారు. అయితే సూర్యాపేట టికెట్ ఆశిస్తున్న దామోదర్ రెడ్డి ప్రభావం తుంగతుర్తి మీద కూడా ఉంటుందన్న భావనతో కాంగ్రెస్ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.


కామారెడ్డిలో రేవంత్ పోటీ చేస్తే.. షబ్బీర్‌ అలీని నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలో దింపుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ స్థానం డీఎస్ కుమారుడు సంజయ్‌ టికెట్ ఆశిస్తున్నారు. ఇక బాన్సువాడ టికెట్ కోసం ఏనుగు రవీందర్ రెడ్డి, బాలరాజుల మధ్య పోటీ నడుస్తోంది. సురేష్‌ షెట్కార్‌, పటోళ్ల సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. పటాన్‌చెరులో కాట శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఇటీవల పార్టీలో చేరిన నీలం మధు పేరు పరిశీలనలో ఉంది. కరీంనగర్‌లో పురుమల్ల శ్రీనివాస్ పేరు ఫైనల్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

First Published:  6 Nov 2023 8:43 AM IST
Next Story